- యువతను ఆకర్షించండి
- పట్టభద్రులు, జీహెచ్‌ఎంసీఎ,దుబ్బాక సర్వేలన్నీ మనకు అనుకూలం
- అపోహాలను నివృత్తి చేసి ముందుకెళ్లండి
- శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్,అక్టోబరు 3(జనంసాక్షి): ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు స్పందనను సీఎం కేసీఆర్ నాయకుల వద్ద ఆరా తీశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎంకు నేతలు తెలిపారు. నిరుద్యోగులు, యువకులు తెరాసకు వ్యతిరేకమన్న ప్రచారం తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. ఉద్యమకాలం నుంచి యువత అంతా తెరాసతోనే ఉన్నారని చెప్పారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై నేతలు దృష్టి పెట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయన్నారు. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై ప్రజలకున్న అపోహలను తొలగించాలని సీఎం నేతలకు సూచించారు. ఆస్తులన్నీ రికార్డుల్లోకి ఎక్కేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కేసీఆర్ చెప్పారు.అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంతోపాటు పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేస్తారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, కేంద్రం తీరు, రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. సరైన అవగాహన, చైతన్యం లేక అనేకమంది గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవడంలేదు. వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా టీఆర్‌ఎస్ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనూ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తేవాలని సీఎం సూచించనున్నారు.ఇప్పటి వరకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ రామచంద్రరావు కొనసాగారు. వారి పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా మొదలైంది.