60 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకా
ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశంలో మార్చి 1తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 45 ఏళ్లు దాటినవారికి కూడా టీకాలు అందిస్తామన్నారు. దేశంలో మొత్తం పదివేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామన్నారు. మరో 20వేల ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ఇస్తామన్న జవదేకర్ వ్యాక్సిన్ల ధరలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే ఇప్పటికే దేశంలో ప్రంట్ లైన్ వారియర్స్ కి కరోనా వైరస్ టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. వద్ధులు, బహుళ వ్యాధులుగలవారు వచ్చే నెల 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను పొందవచ్చు. 60 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళ వయసు పైబడినవారు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులు. ప్రైవేటు ఆసుత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం మాట్లాడుతూ, 60 ఏళ్ళ వయసు పైబడినవారు, ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో ఏక కాలంలో బాధపడుతున్న 45 ఏళ్ళ వయసు పైబడినవారు మార్చి 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ పొందవచ్చునని తెలిపారు. దాదాపు 10 వేల ప్రభుత్వ, సుమారు 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తారని చెప్పారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే లభిస్తుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ చేయించుకోవాలనుకునేవారు సొమ్ము చెల్లించవలసి ఉంటుందన్నారు. నిర్దిష్టంగా ఎంత సొమ్ము చెల్లించాలనే విషయంపై మూడు లేదా నాలుగు రోజుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ అంశంపై మాన్యుఫ్యాక్చరర్లు, ఆసుపత్రులతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ జరిగిన తీరును ప్రస్తావిస్తూ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం 7 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. 2,54,356 సెషన్స్‌లో వ్యాక్సినేషన్ చేసినట్లు చెప్పారు. 64,98,300 మంది హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి డోసు, 13,98,400 మంది హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, 42,68,898 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి డోసు ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో జరుగుతోంది. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రెండో డోసు వ్యాక్సినేషన్ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులు పూర్తయిన అనంతరం రెండో డోసు ఇస్తున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 2 నుంచి ప్రారంభమైంది.