ముంబయి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ చేరింది. యాడిటివ్స్‌తో కూడిన పెట్రోల్ (వాహన పనితీరు మెరుగుపర్చేందుకు పెట్రోల్‌లో రసాయనాలు కలుపుతారు) ధర రూ.100 దాటినట్లు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుడొకరు తెలిపారు. ఆదివారం ఉదయం పెట్రోల్ ధర మరో 28 పైసలు పెరగడంతో రిటైల్‌గా విక్రయించే పెట్రోల్ ధర రూ.100 దాటినట్లు పేర్కొన్నారు. సాధారణ పెట్రోల్ ధర రూ.97.38గా ఉందన్నారు.దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు అందుకు కారణం. పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ధరలు కాస్త ఎక్కువే. అందులోనూ పర్బని జిల్లాలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ జిల్లాకు నాసిక్ జిల్లా మన్మాడ్ నుంచి చమురు రావాల్సి ఉంటుంది. సుమారు 340 కిలోవిూటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. రవాణా వ్యయం అధికమవ్వడంతో లీటర్‌కు 21 పైసలు ఇక్కడ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.