ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి - మంత్రి కే తారకరామారావు

 

హైదరాబాద్ సెప్టెంబర్ 22 జనం సాక్షి 

- సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జి వి కంపెనీ తో మంత్రి కేటీఆర్ సమావేశం

రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జీ వి కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు.  కంపెనీకి చెందిన సత్యనారాయణ ఆయిల్ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారడంతో పాటు, వేలాది మందికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల లో  ఉపాధి లభిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ కి సుప్రసిద్ధమైన మలేషియా దేశంలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్ఫామ్ సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాల పైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని ఆహ్వానించారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటించి ఆయిల్ ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల తో పాటు మరికొన్ని చోట్ల రాష్ట్రంలో ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్,  సిరిసిల్లలో ఫ్యాక్టరీ తో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ , ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీ ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.