దుబ్బాక లాంటి సీన్స్ ఉంటాయన్న కొప్పుల
మంత్రి హరీష్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిని నేత
హుజూరాబాద్,సెప్టెంబర్30 (జనం సాక్షి) : ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈటల రాజేందర్ భారీ కుట్రకు పన్నాగం పన్నాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దుబ్బాకలో రక్తికట్టిన రఘునందన్‌రావు సీన్‌ను హుజూరాబాద్‌లోనూ అమలు చేసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో తన అనుచరులతోనే దాడి డ్రామా ఆడేందుకు వ్యూహాలు పన్నిన్నట్లు తమకు సమాచారం అందిందని మంత్రి ఈశ్వర్ తెలిపారు. కమలాపూర్ మండలంలో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి షోను వాడుకొని, ప్రజల్లో సింపతీ పెంచుకొని, ఓట్లు రాబట్టాలని నీతిమాలిన, దుర్మార్గమైన చర్యలకు పూనుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ ఇటువంటి స్టంట్స్ చేస్తుందని ఎద్దేవా చేశారు. ఎక్కడో సరిహద్దు గొడవలను తీసుకొచ్చిన మన హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తారని మండిపడ్డారు. బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగిందేవిూ లేదని, ఇకనైనా కుట్రలు, కుయుక్తులు మానుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల కుతంత్రాలను పసిగట్టి బుద్ధి చెప్పాలని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటికి వస్తుండటంతో ఆయన అనుచరులే ఛీ కొడుతున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ బీజేపీకి రాజీనామా చేసి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేశారు. ఆమెతోపాటు మరో 300మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, వినోద్‌కుమార్‌లు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారికి సముచిత గౌరవం ఉంటుందని, అంతా పార్టీ అభివృద్ధికి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుర్రం వెంకటేశ్వర్లు మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గుర్రం వెంకటేశ్వర్లు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులు. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణపై అభిమానంతో టీఆర్‌ఎస్‌లోకి వచ్చినట్లు గుర్రం వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.