ఉత్తరాది రాష్టాల్ల్రో పరిస్థితులపై మనీష్ తివారీ మండిపాటు
న్యూఢల్లీి,డిసెంబర్23 (జనం సాక్షి) : అసోం, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ హరీష్ రావత్ ట్వీట్ పార్టీలో దుమారం రేపిన నేపధ్యంలో మనీష్ తివారీ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని తప్పుపట్టారు. అసోం, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎదుర్కొన్న సంక్షోభంతో ఉత్తరాఖండ్ పరిణామాలను మనీష్ తివారీ పోల్చారు. అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ 2014 జులైలో అప్పటి సీఎం తరుణ్ గగోయ్‌తో పాటు పార్టీ నాయకత్వంతో విభేదించి కాషాయ పార్టీలో చేరారు. తనకు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శర్మ ప్రకటించినా సీఎంను చేసేందుకు రాహుల్ గాంధీ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఇక పంజాబ్ సీఎంగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలతో ఆ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో జట్టు కట్టారు. పార్టీ సీనియర్ నేతల నడుమ తలెత్తే విభేదాలు బహిర్గతమైనా వాటిని పరిష్కరించడంలో అగ్రనాయకత్వం విఫలమవడంతోనే ఆయా నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు కనిపిస్తోందని మనీష్ తివారీ ట్వీట్ చేశారు. మనీష్ తివారీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి.