ఒమిక్రాన్‌ తేలిగ్గాతీసుకోవద్దు

 


 

` అప్రమత్తత వీడోద్దు
` డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ హెచ్చరిక
జెనీవా,జనవరి 8(జనంసాక్షి): ఆగ్నేయాసియాలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌?ఓ) కీలక సూచనలు చేసింది. క్షేత్రస్థాయిలో కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. ఒమిక్రాన్‌ అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నా.. అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అన్నిరకాలుగా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.‘కరోనా ఇంకా వ్యాప్తిచెందకుండా అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎక్కడికక్కడ కఠిన నిబంధనలను అమలు చేయాలి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వెంటిలేషన్‌?, భౌతిక దూరం తదితర నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే’ అని ఖేత్రపాల్‌సింగ్‌ సూచించారు. విస్తరిస్తున్న వాటిలో ఒమిక్రాన్‌ కేసులు మాత్రమే కాకుండా.. అత్యంత ప్రమాదకరమైన డెల్టా సహా ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయని తెలిపారు.ఒమిక్రాన్‌ ప్రభావం తీవ్రంగా ఉండదని పలు నిపుణులు చెబుతున్నప్పటికీ.. నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. కొత్త వేరియంట్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరుల ప్రాణాలను కాపాడాలంటే ఆరోగ్య వ్యవస్థలపై భారం పడకుండా నివారించాలన్నారు. టీకా తీసుకున్నప్పటికీ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందేనని హెచ్చరించారు.ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగానే ఉండొచ్చనే వార్తలు ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశమే. అయితే పరిణామక్రమం పరంగా జరిగిన ‘పొరపాటు’ వల్లే ఇది తేలికపాటి వైరస్‌గా ఉందని, తదుపరి వేరియంట్‌ మరింత ప్రమాదకరంగా మారొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపారు. ఆయన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తదుపరి వచ్చే వేరియంట్‌ చెలరేగిపోవచ్చని, అందుకే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.