శిథిలావస్థలో పాత పాఠశాల

 

బాగుచేయాలని కోరుతున్నా పట్టించుకోని పాలకులు
ఖమ్మం,ఫిబ్రవరి4(జనంసాక్షి): పాల్వంచ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాలకు ఉన్న ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో ఆకతాయిలు గోడదూకి శిథిలభవనాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.పాఠశాలకు వంట షెడ్లులేకపోవటంతో ఉన్నగదుల్లోనే మధ్యాహ్న భోజనం వండుతు న్నారు. పాఠశాల భవనాల్లో పిల్‌ల్లలు తరచూ ఆడుకుంటున్నారు. వారిని కట్టడి చేయటం కష్టసాధ్యంగా మారుతుంది. పాఠశాల సెలవుల సమయాల్లో ప్రాంగణంలోని ఎవరెవరో వస్తున్నారు. భవనాలు ఎప్పుడు కూలుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. శిథిల భవనాలను కూల్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి సరోజినీదేవి ఇటీవల పాఠశాలను సందర్శించినప్పుడు కోరారు. ఐదు దశాబ్దాల క్రితం జలగం వెంగళరావు హయాంలో నిర్మించిన ఈ పాఠశాలలో ప్రస్తుత ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావుతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చదువుకున్నారు. వారు చదువుకున్న తరగతి గదులు శిథిలావస్తకు చేరుకున్నాయి. ఇక్కడ చదువుకున్న వందల మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. విదేశాల్లోనూ స్థిరపడ్డారు. పాఠశాల జీవితకాలం ముగియటంతో కొత్త భవనాలు
నిర్మించినా పాత భవనాలను తొలగించక పోవటంతో ఆభవనాలు ఎప్పుడు కూలుతాయోననే ఆందోళన పాఠశాల ఉపాధ్యాయులను వెంటాడుతోంది.విద్యార్థులు కూడా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్టు ఉపాధ్యాయులు వాపోతున్నారు.