తెలంగాణ వ్యవసాయరంగం పురోగమించేలా చర్యలు
పంటకాలనీల ఏర్పాటుకు సత్వర నిర్ణయాలు
అధధికారులతో సవిూక్షలో వెల్లడిరచిన మంత్రినిరంజన్ రెడ్డి
హైదరాబాద్,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ఆదిలాబాద్‌లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రం వెంటనే ఏర్పాటుకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే మౌళిక వసతుల కల్పనకు ,పరిశోధనకు సహకారం అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు ప్రయోజన కార్యక్రమాల తో అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. పంటల వైవిధ్యీకరణతో పాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో పరిశోధనలు జరుగుతు న్నాయని అన్నారు. అంటూ అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ అధికంగా వుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ విధానాలు వారికి చేరవేయడం వంటి అంశాలపై వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖలు, వర్శిటీలు, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే తెలంగాణ కంది పంట అభివృద్ధికై తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించినట్టు తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా పంట కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ మరియు ఇతర కూరగాయల సాగుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని అన్నారు.హైదరాబాద్ చుట్టూనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, కార్పోరేషన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఆయిల్ పామ్ సాగులో శాస్త్రీయ పద్దతులలో నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.ఖమ్మంలో ఉన్న అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు అయిల్ ఫెడ్ కు ఆదేశాలు జారీ చేశామన్నారు.సిద్దిపేటలో 60 ఎకరాలలో, మహబూబాబాద్ లో 84 ఎకరాలలో ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించామన్నారు.ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, వీసిలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, వివిధ సంస్థల చైర్మన్లు కొండూరి రవీందర్ రావు, మార గంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సాయిచంద్, కొండబాల కోటేశ్వర్ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీభాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు