నేతల ఆక్రమణలో చెరువు శిఖాలు
అధికార పార్టీ నేతలపైనే ఆరోపణలు
చెరువుల శిఖం ఆక్రమణలపై తేలని పంచాయితీ?
హైదరాబాద్,ఫిబ్రవరి10(జనంసాక్షి): హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లో చెరువుల ఆక్రమణకు గురికావడం,కోర్టు కేసుల్లో ఉండడం వల్ల వాటి అభివృద్దికి ఆటంకంగా మారింది. దీనికితోడు స్థానిక నేతలు కబ్జాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలపై ఆరోపణలు ఉన్నాయి.ఇటీవలప్రధాని మోడీ పర్యటన సందర్భంగా బిజెపి నేత నందీశ్వర్ గౌడ్ ప్రధాని మోడీకి స్థానిక ఎమమెల్యే కబ్జాలపై ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతినయోజకవర్గంలోనూ ఆరోపణలు ఉన్నాయి. సమారు 12 చెరువుల హద్దులు గుర్తించే విషయంలో కొందరు అభ్యంతరం తెలుపుతూ కోర్టులను ఆశ్రయించారు. ఈ చెరువులు తమ పట్టా భూముల్లో ఉన్నాయంటూ వారు పనులను అడ్డుకోవడంతో ఇక్కడ పనులు చేపట్ట కుండా నిలిపివేశారు. నగర పరిధిలోని సుమారు 63 చెరువులను ఆక్రమణల చెర నుంచి కాపాడటంతోపాటు వాటిని సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.94 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి పాలనాపరమైన అనుమతి కూడా ఇచ్చారు. అయితే కోర్టు కేసులు తదితర
సమస్యల కారణంగా పనులకు కూడా గ్రహణం పట్టింది. కొన్ని చోట్ల ప్రభుత్వ సంస్థలు కూడా అడ్డు తగులుతండటం గమనార్హం.నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గుర్తించిన చెరువుల సుందరీకరణ పనులు జీహెచ్‌ఎంసీకి అప్పగించిన అనేక సమస్యలతో అవి ముందుకు సాగడం లేదు. అనుకున్నట్లుగా సుందరంగా తీర్చిదిద్దితే అనేక కాలనీలకు చెందిన ప్రజలకు ఆహ్లాద వాతావరణం ఏర్పడేది. పిల్లలు సాయంత్రంవేళ ఆడుకునేందుకు అవకాశం చిక్కేది. అయితే ఈ అవకాశం నగరవాసులకు దక్కడంలేదు. చెరువుల్ని సుందరంగా తీర్చిదిద్దే పనులు పూర్తి కావాల్సి ఉండగా అనేక చోట్ల పనులు నత్తలతో పోటీ పడుతున్నాయి. టెండర్లల్లో చేసుకున్న ఒప్పందాల మేరకైతే ఈ పాటికి ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉందని తెలిసింది. అయితే నీటిపారుదలశాఖ పరిధిలోని చెరువుల్లో రెండుమూడు మాత్రమే పూర్తికావచ్చాయి. మిగిలిన చెరువుల పనులకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కాయితమ్మ చెరువు సవిూపంలో కొంత గృహనిర్మాణ శాఖకు చెందిన భూమి ఉన్నట్లుగా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ చెరువు సుందరీకరణ పనుల కోసం స్థలాన్ని ఇవ్వడం కుదరదని ఆ శాఖ అధికారులు చెబుతుండటంతో నీటి పారుదల శాఖ అధికారులు ఈ స్థలం కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాగే మరో రెండు చెరువులు రక్షణ శాఖకు చెందిన భూముల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ రెండు చెరువుల పనులను కూడా పక్కన పెట్టారు. మిగిలిన చెరువులకు సంబంధించి నిధుల కొరత కూడా కారణమవుతోందని తెలిసింది. దీంతో గుత్తేదారులు కూడా పనులు చేయడంలో కొంత నిరాసక్తత కనబరుస్తున్నారు. ఫలితంగా టెండర్ల పక్రియ పూర్తయి ఏడాది గడుస్తున్నా చెరువుల సుందరీకరణ పనులు పూర్తికావడం లేదు. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు.