.రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి రెండు ప్రత్యేక విభాగాలు


హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మత్తు పదార్ధాల నిర్మూలనకోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు ఇక నుంచి పటిష్ట చర్యలు చేపట్టనున్నాయి. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తారు. నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌లో ఒక ఏసీపీ, ఒక ఇన్‌స్పెక్టర్‌, ఒక ఎస్‌ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. రేపు రాష్ట్ర డీజీపీ ఈ రెండు విభాగాలను ప్రారంభించనున్నారు.