సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు

ఉపాధిహావిూ నిధులతో డంపింగ్‌ యార్డుల నిర్మాణం


వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): పల్లె ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల స్థలాలను గుర్తించారు. మంత్రిఎర్రబెల్లి దయాకర్‌ రావు చొరవతో ప్రతి గ్రామపంచాయతీలో తడి, పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా తప్పకుండా తడి, పొడి చెత్తను వేరుచేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డంపింగ్‌ యార్డుల పక్కనే వర్మికంపోస్ట్‌ తొట్టెలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తికాగానే ఈ పక్రియ ప్రారంభం కానున్నది. ఇప్పటికే అధికారులు తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ రెండు చెత్తబుట్టలను అందజేశారు. చెత్త సేకరణకు వచ్చే రిక్షా, ట్రాక్టర్‌లో తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. ఈ పక్రియతో పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపడనున్నది. జిల్లాలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం గ్రామాల్లో పారిశుద్ద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో తప్పని సరిగా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులు ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన పనులను ఇప్పటికే ముమ్మరం చేశారు.


అలాగే వాటికి సంబంధించిన పనులు జిల్లాలో పూర్తి కావస్తున్నాయి. ఇంతకు ముందులా ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకూడదన్న నిబంధనల నేపథ్యంలో ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేసేవారు. దీంతో మురుగుకాలువల్లో, రోడ్లపైనా ఎక్కడ పడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్‌ కవర్లు దర్శనమిచ్చేవి. కానీ వీటి నిర్మాణంతో ప్లలెల్లో పారిశుద్ధ్యం మెరుగు పడనున్నది. ఉపాధిహావిూ ద్వారా వీటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఒక్కో డంపింగ్‌ యార్డుకు ఉపాధిహావిూ నిధులు రూ.1.60 లక్షలు కేటాయించారు. జీపీ నుంచి అవసరమైనన్ని నిధులు వినియోగించుకోవచ్చు. సేంద్రియ ఎరువుల తయారీకి వాడుకోవచ్చిన తెలుస్తోంది.