పంజావిసురుతున్న చలిపులి


హైదరాబాద్‌లో చలకితోడు చిరుజల్లులు


దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు


హిమాలయాల విూదుగా శీతల గాలులు


అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు


హైదరాబాద్‌,డిసెంబర31(జనం సాక్షి)   చల్లగాలులు తెలుగు ప్రజలను వణికిస్తున్నాయి. చలి తీవ్రత రాత్రివేళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోవడమే గాకుండా చలిగాలులు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండటంతో పలు ప్రాంతాల్లో సూర్యుడి దర్శనం కనిపించలేదు. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చిరుజల్లులు పలుకరించాయి. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అవిూర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఖైరతాబాద్‌లో చిరుజల్లులు కురిశాయి. అటు అంబర్‌పేట్‌, నాగోల్‌, దిల్‌సుఖ్‌నగర్‌,   ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, తదితర ప్రాంతాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి. చలికితోడు చిరుజల్లులు పలుకరించడంతో నగరవాసులు మరింతగా చలికి వణికిపోయారు.దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. శీతల గాలుల నుంచి ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని, వృద్దులు, పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.  విశాఖ ఏజెన్సీని చలి వణికిస్తోంది. లంబసింగిలో అత్యల్పంగా జీరో డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు డిగ్రీలకు ఉష్టోగ్రతలు పడిపోయింది. గడచిన 10ఏళ్లలో 2010 డిసెంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే దర్శనమిస్తుండటం గమనార్హం. ఈ చలి తీవ్రతకు స్వెట్టర్లు, గ్లౌజులు, మాస్క్‌లు, హీటర్లకు 


డిమాండ్‌ బాగా పెరిగింది. మరోవైపు  శీతల గాలుల ఉద్ధృతి పెరగడంతో రాష్ట్ర ప్రజలు చలితో ఇబ్బందుల పాలవుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత రాష్టాల్ర నుంచి రెండువైపులా శీతల గాలులు తెలంగాణవైపు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 6 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం సాధారణంకన్నా తక్కువగా ఉంటున్నందున వేడి తగ్గింది. గాలిలో తేమ బాగా తగ్గడంతో పొడి వాతావరణం ఏర్పడుతోంది. రాత్రి చలి, పగలు పొడి వాతావరణం వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరో రెండురోజులు సైతం చలి ఇదే విధంగా కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు తెలిపారు. ఉత్తరాది నుంచి వచ్చే శీతల గాలులు తొలుత ఉత్తర తెలంగాణలో ప్రవేశిస్తాయని అందువల్లనే ఆదిలాబాద్‌, మెదక్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పడిపోవడం సాధారణం అని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి వాతావరణం అధికంగా ఉంది. హిమాలయాల నుంచి దేశమంతటికీ శీతల పవనాలు అధికంగా వీస్తున్నాయి.


గజగజ వణుకుతన్న ఆదిలాబాద్‌


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి భయానికి ప్రజలు గడపదాటాలంటే భయపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. శీతల గాలులు వీచడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలు గజగజ వణుకుతున్నారు.  రాబోయే రోజుల్లో ఈదురు గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. బయట వెళ్లాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొగమంచు ఆవరించడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో లైట్లు వేసుకొని ముందుకు కదలాల్సిన పరిస్థితి నెలకొంది. కుమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. కశ్మీర్‌ను తలపిస్తున్న ఈ వాతావరణంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.