నగరంలో అధ్వాన్నంగా చెత్త నిర్వహణ


అధికారుల పనితీరుపై మండిపడ్డ మేయర్‌


హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైన చెత్త వేస్తే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన వారిపై మండిపడ్డారు. జోనల్‌ పరిధిలో చాలా మంది అధికారులు సరిగా పనిచేయడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని మేయర్‌ అన్నారు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉన్నదనీ.. అందుకుగానూ 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికీ 44 లక్షల కుటుంబాలకు డస్ట్‌బిన్స్‌ ఇచ్చామని, చెత్తను సేకరించడానికి ఆటోలు వెళ్లడం లేదని ఆయన అన్నారు. కొన్ని చోట్ల అయితే 15 రోజులకు ఒక్కసారి కూడా చెత్త సేకరించడం లేదనీ.. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని మేయర్‌ అన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఈ-క్లీన్‌డ్రైవ్‌ ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు ఈ డ్రైవ్‌ ఉంటుందన్న మేయర్‌.. జీహెచ్‌ఎంసీలోని వింగ్స్‌ అన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.