ఆమ్‌ ఆద్మీపార్టీకి పీకే సేవలు


అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించనున్న పీకే
- ట్విటర్‌లో ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
- ధృవీకరించిన ఐపాక్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌14(జ‌నంసాక్షి) : ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకొనేందుకు ఆమ్‌ ఆద్మీ వ్యూహాలు సిద్ధంచేసుకుంటుంది. దీనిలో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌తో జతకట్టింది. రాజధానిలో జరగబోయే ఎన్నికలకు ప్రశాంత్‌ కిషోర్‌ కన్‌స్టలెన్సీ సంస్థ ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐ-పీఏసి)తో ఆప్‌  కలిసి పనిచేయనున్నట్టు ట్విటర్‌ ద్వారా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. ఐపాక్‌ కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, స్వాగతం అంటూ కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేశారు. దీంతో కేజీవ్రాల్‌, పీకే (ప్రశాంత్‌ కిషోర్‌) టీం భాగస్వామ్యం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని ఐపాక్‌ కూడా తన ట్వీట్‌ ద్వారా ధృవీకరించింది. పంజాబ్‌ ఎన్నికల తరువాత గట్టి పోటీదారుగా ఆప్‌ను గుర్తించామని, ఈ నేపథ్యంలో ఆప్‌తో కలిసి పనిచేయనుండడం సంతోషకరమని ఐపాక్‌ పేర్కొంది. వివాదాస్పదమైన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ వ్యతిరేకించారు. అలాగే  ఐపాక్‌ తాజా క్లయింట్లు, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజీవ్రాల్‌ కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే కావడం ఆసక్తికరమైన విషయం. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్టాల్ల్రో పాగా వేసి, ఢిల్లీలో కూడా అధికార పగ్గాలకోసం ఉవ్విరూళుతున్న బీజేపీ షాకిచ్చేలా కేజీవ్రాల్‌ ఈ కీలక అడుగు వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా తనదైన శైలిలో రాణిస్తూ ఆయా పార్టీలకు అధికారాన్ని సునాయాసంగా అందిస్తున్న పీకే వ్యూహాలు అరవింద్‌ కేజీవ్రాల్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి.