హలో మాల చలో ఢిల్లీ

కరపత్రాన్ని విడుదల చేసిన మాలమహానాడు


గుంటూరు,డిసెంబర్‌14(జనం సాక్షి ): హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు గోదా జాన్‌ పాల్‌ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ మాలమహానాడు కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హలో మాల చలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ జరిగింది. నియోజకవర్గ వర్కింగ్‌ అధ్యక్షులు వుసైల జయరావు అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు గోల జాన్‌పాల్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని కొట్టి వేసినప్పటికీ నేటి బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పటం మా మనోభావాలు దెబ్బ తీయడమేనని అన్నారు. అంతే గాకుండా రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీర్పుని ఖాతారు చేయకుండా మాట్లాడుతున్న ఆయా రాజకీయ పార్టీల అంతం పంతం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాల నుండి మాలలు లక్షలాదిగా ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ లో నిరసన కార్యక్రమానికి తరలిరావాలని అన్నారు. 23 సంవత్సరాల ఎమ్మార్పీఎస్‌ పోరాటంలో 50 సంవత్సరాల దళితులకు రాజ్యాధికారం దూరమైందని నేటి కైనా మాదిగ సోదరులు వర్గీకరణ విషయాన్ని పక్కనపెట్టి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని అన్నారు. మాల ఎంపీలు మాత్రమే కాక దళిత ఎంపీలు ఆయా రాజకీయ పార్టీల ఎంపీలు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా చూడాలని రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలోమాల మహానాడు నరసరావుపేట మండల అధ్యక్షులు బ్రహ్మం, రొంపిచర్ల మండలం అధ్యక్షులు వి శ్రీను, ఉపాధ్యక్షులు పాలడుగు రామయ్య, మహిళా నాయకురాలు మ్లలెల అనిలా, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్‌ గోదా బాల, సీతయ్య, ఎడ్ల సతీష్‌, సల్మాన్‌ దాసు, ప్రసాద్‌, మొలతాటి రక్షణ, కారుమంచి రాజు, అంబటి శివ తదితరులు పాల్గొన్నారు.