చంద్రబాబు ఉచ్చులో రైతులు పడొద్దు


బాబు ఏది చెబితే పవన్‌ అదే సై అంటాడు


జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించాలి: కొడాలి నాని


అమరావతి,డిసెంబర్‌19 (జ‌నంసాక్షి):   రాష్ట్రంలో మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్వాగతించారు. చంద్రబాబు ఏం చెబితే...పవన్‌ కల్యాణ్‌ అదే చెబుతారని ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఆందోళన చెంది వీరి ఉచ్చులో పడాల్సిన పనిలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే గ్రాఫిక్స్‌ వాస్తవంగా సాధ్యం కాదని, నగరాలు నిర్మించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌, చెన్నై, ముంబైని ప్రభుత్వాలు నిర్మించాయా అని ఆయన సూటిగా ప్రశ్నలు సంధించారు.వైఎస్‌ జగన్‌ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో కాదని ఆయన అన్నారు. కొడాలి నాని గురువారమిక్కడ విూడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి ఒకేచోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై అనేక ఏళ్లుగా డిమాండ్‌ ఉందని, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అందుకే సీఎం జగన్‌ మూడు ప్రాంతా అభివృద్ధిపై మాట్లాడరని మంత్రి కొడాలి నాని తెలిపారు. రాజధానిపై నిపుణుల కమిటీ అధ్యయం చేసి నివేదిక ఇస్తుందని, దానికి అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇంతలోనే కొంపలు మునిగిపోయినట్లు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ రాద్దాంతం చేస్తున్నారని కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రజలంతా ఆమోదించే విధంగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ఉత్తరాంద్ర, రాయలసీమ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారని మంత్రి


కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా వాసిగా సీఎం జగన్‌ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున?నానని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీని తీసుకువచ్చి దేశం మధ్యలో పెట్టమంటారా అని ఎదురు ప్రశ్న వేశారు. ఇక సుజనా చౌదరి మాటలకు బీజేపీలో విలువలేదని, జైలుకు పోకుండా తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరారని మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రాజధానిపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్‌ క్యాపిటల్‌), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు.