వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి

- నా తప్పుంటే బహిరంగంగా ఉరితీయండి
- సిట్‌ అధికారుల ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పా
- మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
- ఆదినారాయణరెడ్డి, వివేకా వ్యక్తిగత కార్యదర్శిని విచారించిన సిట్‌
కడప, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈమేరకు ఆదినారాయణరెడ్డి గురువారం సిట్‌ అధికారులు ఎదట హాజరయ్యారు. దాదాపు గంటపాటు విచారణ జరిగింది. ఆదినారాయణతో పాటు వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సిట్‌ 
అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని అన్నారు.  హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో 30 ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ సవివరంగా సమాధానమిచ్చానని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో నా తప్పు ఉంటే బహిరంగంగా ఉరితీయాలని చెప్పానని, వివేకాను ఎవరు హత్య చేశారో అందిరి మనస్సాక్షికి తెలుసని అన్నారు. కావాలనే అందర్నీ ప్రశ్నిస్తున్నారని అన్నారు. గతంలో వివేకా హత్యకేసును అప్పట్లో సీబీఐ కావాలని జగన్‌ హైకోర్టులో రిట్‌ వేశారని, ఆయన సీఎం అయిన తర్వాత ఎందుకు సిట్‌ వేశారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పార్టీలు సీబీఐ కావాలని కోరుతున్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి గతవారం సిట్‌ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్‌ దస్తగిరి, ప్రకాష్‌లను ప్రశ్నించారు. ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు. మరికొందరు అనుమానితులు, సాక్ష్యుల్ని కూడా విచారణకు పిలుస్తున్నారు. ఆదినారాయణరెడ్డితో పాటూ మరికొందర్ని కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. మరికొంతమందిని కూడా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.. టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్‌ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినా నిందితులు మాత్రం దొరకలేదు. జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.