రాజధానిని అమ్మేందుకే జగన్‌ కుట్ర


- బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
- మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో గంటపాటు మౌనదీక్ష చేసిన కన్నా
గుంటూరు, డిసెంబర్‌27(జ‌నంసాక్షి) : రాజధానిని అమ్మేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర పన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా ఉద్ధండరాయపాలెంలో అమరావతి కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో ఆయన గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన అనంతరం కన్నా మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని భూములను నచ్చిన వారికి 
అమ్ముతామని వైకాపా నేతలు చెబుతున్నారని ఆరోపించారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను జగన్‌ నిట్టనిలువునా ముంచుతారని ఎవరూ ఊహించలేదని కన్నా వ్యాఖ్యానించారు. రాష్టాన్న్రి సొంత జాగీరుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని, అందుకే రాజధానిని గంపగుత్తగా అమ్మేసేందుకుయత్నిస్తున్నారని విమర్శించారు. రాజధానికోసం రైతులు చేసిన త్యాగం గుర్తించి పన్ను చెల్లింపుల విషయంలో కేంద్రం మినహాయింపు ఇచ్చిందని చెప్పారు. రాష్టాభ్రివృద్ధి కోసం గతంలో ప్రధాని మోదీ అన్ని ప్రాంతాల్లో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మౌలికవసతులు కల్పనకు కేంద్రం కృషిచేసిందని చెప్పారు. ఏం సాధించారని విశాఖలో సంబరాలు చేసుకుంటున్నారని కన్నా ప్రశ్నించారు. జగన్‌ తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భాజపా గట్టిగా పోరాటం చేస్తుందని, ఇందులో భాగంగానే మొదటి అడుగుగా మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేశామని కన్నా వివరించారు. జీఎన్‌రావు కమిటీని తాను స్వాగతించినట్లు బొత్స చేసిన వ్యాఖ్యలపై కన్నా మండిపడ్డారు. ఇదిలా ఉంటే కేబినెట్‌ నిర్ణయం తరువాత తమ తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని తెలిపారు.