కొత్త హంగులతో యాదాద్రి ఆలయం


- త్వరలో పనులు పూర్తికాబోతున్నాయి
- ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ 
హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, కొత్త హంగులతో ఆలయం భక్తులకు త్వరలో దర్శనమివ్వనుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆలయ పునర్నిర్మాణ పనులపై ఓ ట్వీట్‌ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునరుద్ధరించబడిందని, ఈ ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్‌ మరో గొప్పతనం కేటీఆర్‌ అన్నారు. ఆలయ పునర్నిర్మాణం మొత్తం రాతితోనే జరిగిందని, రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయం మొత్తం గ్రానైట్‌తో కట్టిన కట్టడంగా దేశంలో అతి పెద్ద టెంపుల్‌గా నిలిచిపోతుందని కేటీఆర్‌ అన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, ప్రాచీన కట్టడం మాదిరి ఆలయ పునర్నిర్మాణం జరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాబోయే 2000 సంవత్సరాల వరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భారత్‌కు ఇది ఒక గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ట్వీట్‌ చేసిన వీడియోలో కేటీఆర్‌ పేర్కొన్నారు.