చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు: కలెక్టర్‌

కొత్తగూడెం,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల ప్రగతిని పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు. ఇంటి నుంచి చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రణాళిక ప్రకారం ఆయా గ్రామాల్లో వ్యర్థాల సేకరణకు పంచాయతీ సిబ్బంది వస్తారనే సమాచారాన్ని ప్రజలకు తెలపాలని, చెత్తను పొడి, తడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందజేయాలన్నారు. గ్రామాలు స్వచ్ఛతను సంతరించుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాలను సిబ్బందికి అందజేయాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేశామని, ఈ నెల 15లోగా నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. చేపట్టిన ఇంకుడు గుంతలు నిర్మాణాలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణ పనులను ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. హరితహారం లో రెడేళ్లలో నాటిన మొక్కలను పరిశీలించిచనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే హరితహారంలో మొక్కలు నాటేందుకు నర్సరీలో మొక్కలు పెంచాలన్నారు.