ఆర్టీసీ సమ్మె విరమణతో మళ్లీ పెరిగిన ట్రాఫిక్‌


నగర రోడ్ల తీరుతో తప్పని కష్టాలు


మెట్రోకు తగ్గిన ప్రయాణికులు


హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఆర్టీసీ సమ్మె ముగిసి బస్సులు రోడ్డెక్కడంతో మళ్లీ ట్రాఫిక్కష్టాలు మొదలయ్యాయి. ప్రజలకు రవాణా అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ప్రధాన కూడళ్లలో యూటర్నల్కారణంగా పరిస్థితి దారుణంగా ఉంటోంది. బస్సులకు యూటర్న్‌ వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు నగరరోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. వాటిని చక్కబెట్టే ప్రయత్నాలు సాగడం లేదు. రోడ్లను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగిస్తామని మంత్రి కెటిఆర్‌ ప్రకటించినా ఎక్కడా ప్రయత్నాలు మొదలు కాలేదు. ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. సమ్మె కాలంలో మెట్రోను ఆశ్రయించిన ప్రజలు ఇప్పుడు మళ్లీ ఆర్టీసీని ఆశ్రయించడంతో మెట్రోలో రద్దీ తగ్గింది. సమ్మెతో ఇంతకాలం మెట్రో రైళ్లు నిత్యం కిటకిటలాడాయి. సుమారు 52 రోజుల పాటు జరిగిన సమ్మెతో రెండు మెట్రో కారిడార్‌లలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండడంతో నగరవాసులు మెట్రోనే ఆశ్రయించారు. కాగా ఆర్టీసీ సమ్మె ముగియడం, సిటీ ఆర్టీసీ బస్సుల పునరాగమనంతో మెట్రోలో ప్రయాణికుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. సమ్మె సమయంలో మెట్రోలో ప్రతి రోజూ 4లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు.ఆర్టీసీ సమ్మె సమయంలో బస్సులు అతి తక్కువగా ఉండగా ప్రస్తుతం సిటీ బస్సులు 3వేలకు పైగా తిరుగుతున్నాయి. దీంతో నగరవాసులు ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తుండడంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మెట్రో కంటే బస్సు చార్జీలు తక్కువగా ఉండడం, బస్సులు అందుబాటులో ఉన్న వారు చాలామంది ఉండడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కసారిగా 20-30వేలకు తగ్గిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌లో ఎంతో కీలకమైన రాయిదుర్గం మెట్రోస్టేషన్‌ను నవంబర్‌ 29నే ప్రారంభించడంతో మెట్రోలో ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలోనే ప్రయాణం చేస్తున్నారు. ర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తుండగా, కొంత మేర ప్రయాణికుల సంఖ్య తగ్గినా రాయిదుర్గం వరకు మెట్రో మార్గం పొడిగింపు వల్ల రద్దీ కొంత పెరుగుతోందని తెలిపారు. మరో రెండు నెలల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య స్థిరంగా ఉంటుందని, అప్పటి వరకు ఎక్కువ, తక్కువగా ఉండే అవకాశం ఉందని మెట్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు.