కొత్త ఏడాది ఆనందోత్సాహాలతో సాగాలి


కలెక్టర్‌, ఎస్పీల ఆకాంక్ష


మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌31(జనం సాక్షి)  : జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌  రొనాల్డ్‌ రోస్‌  సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జిల్లా అభివృద్దికి ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకారం అందించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ పథకాలను అందరూ అందిపుచ్చుకుని ముందుకు సాగాలన్నారు. హరితహారంలో వచ్చేయేడు గణనీయమైన ప్రగతికి ప్రజలు తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ కోరారు. బాల్య వివాహాలను నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ అన్నారు. జిల్లాలో ఇప్పటికీ ఇళ్ల వద్ద ప్రసవాలు జరుతున్నాయని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ప్రతి కాన్పు ఆసుపత్రిలో జరిగేలా చూడాలని సూచించారు. కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టాలని, బాలికలకు వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచాలని, నెలలో 20 అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌ వైజర్స్‌ తనిఖీ చేయాలని ఆదేశించారు. అభివృద్దిలో తాము ఓ చేయి వేసి ముందుకు సాగుదామని 


అన్నారు. కొత్త ఏడాది ప్రజలతో కలిసి పని చేస్తామని, సమస్యలు ఉంటే నేరుగా తమతో విన్నవించు కోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. ఇప్పటికే ప్రజల భాగస్వామ్యం పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలన్నారు. మండలంలోని పరిశ్రమలలో పని చేసేందుకు దేశంలోని వివిధ రాష్టాల్రకు చెందిన కొత్త వ్యక్తులు వస్తారని , కొత్త వ్యక్తుల కదిలికలను ఎప్పటికప్పుడు గమనిచాలని సూచించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే 100 డయల్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. అధికారుల మాట, పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. చిన్న జిల్లాలు కావడంతో పర్యవేక్షణ పెంచేందుకు అకాశం లభించిందన్నారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణ కోసం ఇవి ఎంతగనో దోహదం చేస్తాయని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు కూడా ఆన్‌లైన్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకు 99 శాతం పూర్తి అయిందని చెప్పారు. కేసుల విచారణ వేగంగా జరగడంతో పాటు నేరస్థులకు శిక్షపడే విధంగా పర్యవేక్షణ చేసేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.  జిల్లాలో రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలు, బాలల రక్షణపై ప్రత్యేక నిఘాతో పాటు అవగాహన కార్యక్రమలు నిర్వహించి, వారికి ఇబ్బంది కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.