ఉప్పల్‌లో ఆటోను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి


హైదరాబాద్‌: ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో బీభత్సకరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. చిన్నారుల ఆక్రందనలు, హాహాకారాలు అక్కడివారిని కలిచివేశాయి. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక విద్యార్థి మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.




 



లారీ అత్యంత వేగంగా దూసుకురావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడో తరగతి చదువుతున్న అనంత్‌కుమార్‌ మృతి చెందాడు. హబ్సిగూడ భాష్యం స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఆటోలో వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.