జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు

అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్‌కు వెళ్లి.. సీఎంకు రాఖీలు కట్టారు. మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్న పిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని సీఎం చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, ¬ంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాతో పాటు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. గురువారం మహిళల భద్రతకు సంబంధించి ఆంధప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్ట సవరణ బిల్లు-2019కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే.. మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష పడుతుంది. కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేస్తారు. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి.. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకు ఓ కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతాయి. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్‌ విూడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకురాబోతున్నారు.