అన్ని పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం


- ఐదేళ్లలో తెలంగాణకు 12వేల పరిశ్రమలొచ్చాయి
- యువతకు ఉద్యోగాలకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
- వరంగల్‌ జౌళిపార్కులో పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తాం
- హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతాం
- ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి వర్ధిల్లుతుంది
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 
- వరంగల్‌లో ఐటీ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
వరంగల్‌, జనవరి7(జనంసాక్షి) : రాష్ట్రంలోని అన్ని ప్రధాన, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరిస్తామని, యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌లో మూడు ఐటీ కంపెనీలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నగరంలోని మడికొండలో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా, ప్రాంగణాలను ప్రారంభించారు. దీంతోపాటు ఐటీ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ను కూడా ఆరంభించారు. ఇప్పటికే ఆధునిక హంగులతో ఐదెకరాల్లో సైయెంట్‌ భవనాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ కేంద్రంలో 600 నుంచి 700 మంది ఉద్యోగులతో సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. ఇక టెక్‌ మహీంద్రాలో 100 వరకూ విధులు నిర్వర్తించవచ్చు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అడిగిన వెంటనే పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన సైయెంట్‌ ఛైర్మన్‌ బీవీ మోహన్‌ రెడ్డి, టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానీకి ధన్యవాదాలు తెలిపారు. 2018 ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వేదికలో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో టెక్‌ మహీంద్రా గుర్నానీని కలిశానని, హైదరాబాద్‌ తర్వాత మంచి వనరులు ఉన్న వరంగల్‌లో కంపెనీ ప్రారంభించాలని కోరానని అన్నారు. వెంటనే ఆయన అక్కడికక్కడే అంగీకరించారని, రెండేళ్లలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. వరంగల్‌ పట్టణంలో, ఇతర జిల్లాల్లో ఐటీ విస్తరణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. సైయెంట్‌ కన్నా టెక్‌ మహీంద్రా దాదాపు 9రెట్లు పెద్దదని, వరంగల్‌ యువతకు ఇక్కడే ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మంలలో ఈ ఏడాదిలోనే ఐటీ రంగాన్ని విస్తరింపజేసే నిశ్చయంతో ఉన్నామని మంత్రి తెలిపారు. వరంగల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని కూడా త్వరలో పూర్తి చేయనున్నామని,  ఈ ప్రాంతాన్నంగిటిని పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఉప్పల్‌ వద్ద స్కైవే పూర్తయితే ఇక వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు కేవలం గంటన్నర వ్యవధిలో చేరుకోవచ్చునని, వరంగల్‌కు రింగ్‌ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతోందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్‌ను అద్భుతమైన పారిశ్రామిక కారిడార్‌గా రూపొందిం చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. యాదాద్రి క్షేత్రం కూడా ఈ కారిడార్‌లోనే రానుందని, పరకాలలో టెక్స్‌టైల్‌ పార్క్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో లెదర్‌ పార్కు, జనగామ ప్రాంతంలో కొత్త పరిశ్రమలకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇలా హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకూ ఒక కారిడార్‌ను తయారు చేస్తున్నామన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టును త్వరలో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, హెలీపోర్ట్‌ సర్వీసును కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ అన్నారు. అదేవిధంగా యాదాద్రి ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్దిల్లుందని 
అన్నారు. ఇలా రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో తీరిగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాఠోడ్‌ తదితరులు పాల్గొన్నారు.