జగిత్యాలలో మున్సిపల్‌ వేడి

ప్రచారంలో ముందున్న టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు


కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు


జగిత్యాల,జనవరి2  జనంసాక్షి  జగిత్యాల జిల్లాలో ఉన్నమూడు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురేయాలన్న పట్టుదలతో నేతలు పావులు కదుపుతున్నారు. జగిత్యాల, కోరుట్ల,మెట్‌పల్లి,ధర్మపురి, రాయపట్నం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ మేరకు తమ పరిధిలోని పట్టణాలపై వీరు దృష్టి సారించారు.  మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు కేటాయిస్తామని చెప్పారు.  టిఆర్‌ఎస్‌తోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని ఇప్పటికే ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, విద్యాససాగర్రావులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సమావేశాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ పార్టీ అని, పార్టీకి అన్ని మతాలూ సమానమేనని, దేశం కోసం, రాష్ట్రం కోసం పార్టీ పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరించారని, వారికి ఓట్లడిగే నైతిక హక్కు లేదని, ప్రజలను ఓట్లడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర కొనసాగిస్తామని డాక్టర్‌ సంజయ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ జగిత్యాలను జిల్లా చేసి తెలంగాణ ముఖచిత్రంలో మొదటి స్థానం కల్పించారన్నారు. జిల్లా కార్యాలయ భవన నిర్మాణాలకు రూ.50కోట్లు కేటాయించారని చెప్పారు. గతంలో మంజూరైన నర్సింగ్‌ కళాశాల నిర్మాణానికి అప్పటి నాయకులు స్థలాన్ని కూడా కేటాయించలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కల్వకుంట్ల కవిత సహకారంతో రూ.16కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలోని హాస్టల్‌ భవన నిర్మాణానికి రూ.22కోట్లు, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.30 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.జగిత్యాల పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ, తదితర నిర్మాణాలకు రూ.50కోట్ల మంజూరు చేశామన్నారు. జగిత్యాల పట్టణంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.1.30కోట్ల నిధులు కేటాయించామని, అ భివృద్ధి పనులు ప్రారంభమయ్యాయన్నారు. టీఆర్‌నగర్‌లో రూ.2.50కోట్లతో డంప్‌యార్డు నిర్మాణం ఏర్పాటు చేశామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్ల టికెట్లను కమిటీల ద్వారానే కేటాయిస్తామని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. అలాగే  మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. 


జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో విజయం సాధించి  సత్తా చాటాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మత్స్య కార్మికులకు చెరువులను అభివృద్ధి చేసి చేప పిల్లలను ఉచితంగా అందించిందని, 75శాతం సబ్సిడీతో వివిధ రకాల వాహనాలను అందించింద ని గుర్తు చేశారు. గీతా కార్మికులకు ఉన్న ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షలకు పెంచిందని, ఆటో, ట్రాక్టర్లకు టాక్సీ రద్దు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కుతుందన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.5లక్షల ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టామని, భవన కార్మికులకు గతంలో రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.6 లక్షలకు పెంచామని చెప్పారు. ఎన్నికలు ఇప్పుడే వద్దంటూ ప్రతిపక్షాలు కోర్టుల చుట్టూ తిరుగుతు న్నాయని, ఎన్నికలంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కువ లాభపడేది జగిత్యాల జిల్లానేనని, వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు.