చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం


రెండు బస్సులు ఢీ : ఇద్దరు మృతి
చిత్తూరు,జనవరి8(జనంసాక్షి):  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులు గుగ్గుకున్న ఘటనో ఇద్దరు మృతి చెందారు. కాణిపాకం వద్ద రోడ్డు రక్తసిక్తమైంది. 'జర్నీ' సినిమాను తలపించే రీతిలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కాణిపాకం నుంచి తిరుపతి వెలుతుండగా.. అమరావతి ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాసిమెట్ల దగ్గర పూతలపట్టు రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను లారీలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. విజయవాడకు చెందిన అమరావతి ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ బస్సు 'జర్నీ' సినిమాలోలా ఎదురెదుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదంలో విజయవాడ డిపోకు చెందిన డ్రైవర్‌ సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా.. మరో డ్రైవర్‌ రమేష్‌, అటెండర్‌ ప్రసాద్‌ అక్కడికక్కడే మరణించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన పలువురు అయ్యప్ప భక్తులతో పాటు మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తేల్చారు. ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు రాంగ్‌ రూట్‌లో వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బస్సు ప్రమాద ఘటనలో అధికారులు నిర్లక్ష్యం వహించారని బాధితులు చెబుతున్నారు. తిరుపతి సవిూపంలో ప్రమాదం జరిగినా సకాలంలో అంబులెన్స్‌లు చేరుకోలేదని వారు వాపోయారు. కాళ్లు, చేతులు విరిగి గాయాలతో బాధితులు ఆర్తనాదాలు చేశారని, ప్రమాదం జరిగిన రెండు గంటల తరువాత బాధితులతో లారీ ఆసుపత్రికి చేరిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.