హైదరాబాద్ జనంసాక్షి : తెలంగాణలోని ప్రతి రైతు రక్షణే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం వివరణ ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకంలో అనుభవదారు కాలమ్ పెట్టేదే లేదని సీఎం తేల్చిచెప్పారు. రైతుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది తమ పార్టీ పాలసీ కూడా అని స్పష్టం చేశారు. వేల ఎకరాల భూస్వాములు ఉన్నప్పుడు అనుభవదారుల కాలమ్ పెట్టారు. అప్పటి పరిస్థితులకు అది కరెక్ట్. గ్రామాల్లో ఎంతో కష్టం వస్తే తప్ప భూమి అమ్ముకోరు. భూమి ఎవరికి కౌలుకు ఇవ్వాలనేది రైతు ఇష్టమని సీఎం అన్నారు. ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారు కాలమ్.. రైతు భూమి ఎందుకు? అని ప్రశ్నించారు సీఎం. ప్రతి ఎకరం వివాదంలో ఉందని భావించడం సరికాదు. వివాదాస్పద భూములు కేవలం ఒక శాతం లోపే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పేదల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎవరూ చేయని సాహసాన్ని తాము చేస్తున్నామని తెలిపారు. సమగ్ర భూ సర్వేతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఆధునాతమైన టెక్నాలజీతో సర్వే చేయబోతున్నాం. ఈ సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలోనే భూ సర్వే పూర్తి చేస్తామని చెప్పారు.
సమగ్ర భూ సర్వే జిల్లాకొక ఏజెన్సీకి ఇచ్చే అవకాశం ఉందన్నారు. సమగ్ర సర్వే చేసి కన్‌క్లూజివ్ టైటిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీఎం పేర్కొన్నారు. కన్‌క్లూజివ్ టైటిల్ ఇస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందన్నారు. కన్‌క్లూజివ్ టైటిల్ ఇచ్చే సత్తా ప్రభుత్వానికి రావాలని కోరుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు.