వచ్చే జులై నాటికి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌

- కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ వెల్లడి
దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం విశ్రాంతి లేకుండా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ సరఫరా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా నిర్వహించిన సండే సంవాద్‌లో పేర్కొన్నారు. 'టీకాలకు సంబంధించి అన్ని రకాల అంశాలపై పరిశోధించడానికి ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఉంది. వచ్చే ఏడాది జులై కల్లా దాదాపు 400 నుంచి 500 మిలియన్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అవి దాదాపు 25 కోట్ల మందికి మనం సరఫరా చేయడానికి వీలవుతుంది' అని హర్షవర్దన్‌ వెల్లడించారు. కాగా ప్రస్తుతం భారత్‌లో రెండు సంస్థలకు చెందిన టీకా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాటిలో ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ చేపట్టిన టీకా ఒకటి కాగా.. మరొకటి జైడస్‌ క్యాడిలా లిమిటెడ్‌కు చెందింది. ఈ వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా ఆస్ట్రాజెనికాతో కలిసి పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న టీకాపై భారత్‌లో రెండు, మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75వేల కేసులు నమోదు కాగా 940 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా రికవరీల్లో 21శాతంతో భారత్‌ తొలి స్థానంలో ఉందని శనివారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 55లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 9లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.