సూపర్‌ స్ప్రేడర్ల వల్లే 60 శాతం మందికి కరోనా

దిల్లీ,అక్టోబరు 1(జనంసాక్షి): భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, వ్యాధి వ్యాప్తి తీరు, ప్రభావంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకానమిక్స్‌ అండ్‌ పాలసీ(సీడీడీఈపీ) దేశంలో అతిపెద్ద పరిశోధన చేపట్టింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో చేపట్టిన ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలను కనుగొన్నారు. వైరస్‌ బారినపడుతున్న వారు, మరణిస్తున్న వారిలో ఎక్కువగా 40-69ఏళ్ల వయసున్న వారేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. సంపన్న దేశాల్లో నమోదవుతున్న దానికంటే భారత్‌లోనే ఈ వయస్సువారు మరణించడం ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాకుండా, కేవలం 8 శాతం సూపర్‌ స్ప్రెడర్లే దాదాపు 60శాతం పాజిటివ్‌ కేసులకు కారణమైనట్లు ఈ నివేదిక స్పష్టంచేసింది.పరిశోధనలో భాగంగా రెండు రాష్ట్రాల్లో వేల మంది కాంటాక్ట్‌ ట్రేసర్ల నుంచి మొత్తం 5,75,071 టెస్టులకు సంబంధించి సమాచారం తీసుకున్నారు. వీరిలో 84,965 వైరస్‌ సోకిన వారు ఉన్నారు. ఈ పరిశోధన ద్వారా మన దేశంలో వైరస్‌ విస్తరిస్తున్న తీరు, ప్రభావాలను అంచనా వేసినట్లు దీనికి నేతృత్వం వహించిన సీడీడీఈపీ డైరెక్టర్‌ రామన్‌ లక్ష్మి నారాయన్‌ స్పష్టంచేశారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలను పరిశీలించినప్పుడు వీరిలో మధ్యవయస్కుల్లోనే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 13కోట్ల జనాభా ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 30లక్షల మందిని కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా గుర్తించారు. దేశంలోని తొలిసారిగా ఈ స్థాయిలో చేపట్టిన పరిశోధనా నివేదిక తాజాగా సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 70శాతం మంది ద్వారా వారికి సన్నిహితంగా ఉన్న వారికి వైరస్‌ సోకలేదని తాజా పరిశోధనలో స్పష్టమైంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 60శాతం మందికి వైరస్‌ సోకడానికి కేవలం 8శాతం మంది పాజిటివ్‌ వ్యక్తులే కారణమవుతున్నట్లు తేలింది. దేశంలో వైరస్‌ విజృంభణకు ఈ సూపర్‌ స్ప్రెడర్లే కారణమని తాజా ఫలితాలు స్పష్టంచేస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే వయస్సు కలిగిన వారిలోనే వైరస్‌ సంక్రమణ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు పిల్లలు, 65ఏళ్లు పైబడిన పెద్దల్లో ఈ తరహా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాజా నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లో మరణిస్తున్న వారిలో ఎక్కువగా 50-64 ఏళ్ల వయస్సువారే అధికంగా ఉంటున్నారు. ఇది అధిక ఆదాయ దేశాలకంటే భిన్నంగా ఉందని ఈ పరిశోధన వెల్లడించింది.
రెండు రాష్ట్రాల్లో కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో 75ఏళ్లకు పైబడిన వారు కేవలం 17.9శాతం ఉండగా, అమెరికాలో ఈ వయస్సుకలవారు 58.1శాతం మరణిస్తున్నట్లు గుర్తించారు. కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు 63శాతం రోగుల్లో కనీసం ఒక ఇతర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారేనని, 36శాతం మందిలో రెండు కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఈ నివేదిక స్పష్టంచేసింది.కొవిడ్‌ మృతుల్లో అత్యధికంగా 45శాతం మధుమేహం ఉన్నవారే ఉంటున్నట్లు పేర్కొంది.
కొవిడ్‌ సోకి మరణిస్తున్న రోగులు, ప్రాణాలు కోల్పోయే ముందు సరాసరి ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నవారేనని గుర్తించారు. అమెరికాలో ఈ వ్యవధి 13రోజులుగా ఉంది. అక్కడ చనిపోతున్న కొవిడ్‌ రోగులు దాదాపు 13రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు ఉండటంతోపాటు ప్రజారోగ్య సంరక్షణలో తలసరి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అంతేకాకుండా సమర్థవంతమైన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ఉందని వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో చేపట్టిన కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వల్లే ఈ పరిశోధన సాధ్యమైందని దీనికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, విధాన రూపకల్పనలో తాజా నివేదిక ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.