ఆయన జీవితం స్ఫూర్తిదాయకం
నిరాడంబర ,స్ఫూర్తి జీవితాన్ని గడిపారు
హైదరాబాద్,అక్టోబరు 2(జనంసాక్షి):పుస్తకావిష్కరణ సభలో అతిథుల వెల్లడిప్రజా జర్నలిస్టుగా, ప్రజా ఉద్యమకారుడిగా, ప్రజాప్రతినిధిగా మూడు అవతారాలలో జనం కోసం నిలబడిన సోలిపేట రామలింగారెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.దుబ్బాక దివంగత శాసన సభ్యులు, జర్నలిస్టుల సంఘం మాజీ నాయకుడు రామలింగారెడ్డి 40ఏండ్ల ప్రజా జీవిత జ్ఞాపకాలతో మంజీరా రచయితల సంఘం రూపొందించిన ''స్వప్న సాధకుడు'' పుస్తక ఆవిష్కరణ సభ ఇవ్వాళ సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు, మెదక్ ఎంపీ కె.ప్రభాకర్ రెడ్డి, సుప్రసిద్ధ పాత్రికేయులు కె.రామచంద్ర మూర్తి, మానకొండూరు శాసన సభ్యులు రసమయి బాలకిషన్, టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు జి.దేవీప్రసాద్ రావు, తెలంగాణ సాహిత్య అకాడవిూ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఎఫ్.డి.సి చైర్మెన్ వి.ప్రతాప్ రెడ్డి, రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, మరసం అధ్యక్షులు కె.రంగాచారి, టిపిటీఎఫ్ ఉపాధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి, టీయూ డబ్ల్యూజె సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.మల్లికార్జున్ రెడ్డి తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ప్రభావాల లోంచి రామలింగారెడ్డి జీవితం రూపుదిద్దుకున్నందునే ఊపిరి ఆడేంతవరకు ప్రజల కోసం నిలబడ్డారని ఆయన అన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రామలింగారెడ్డి జీవితం సామాజిక చైతన్యంతో కూడుకున్నందునే ప్రజలతో మమేకమై పనిచేసారన్నారు. సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ విభిన్న రాజకీయ సిధ్ధాంతాలను ఆకళింపు చేసుకొని, క్షేత్రావాస్తవికతను గమనించి ఆచరణాత్మకమైన దృక్ఫథంతో ప్రజలకు సేవచేసిన సిసలైన ప్రజాప్రతినిధి రామలింగారెడ్డి అని ఆయన చెప్పారు. ఎమ్యెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే తనకు లింగన్న అందించిన స్పూర్తితో సామాజిక చైతన్యాన్ని అందుకున్నట్లు చెప్పారు. టీఎన్జీవోల సంఘం నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ, సమాజం కోసం కన్న కలలు, చేసిన ఉద్యమాలు, ఆలోచనలను క్షేత్రస్థాయిలో అభివృద్ధి కోసం ఉపయోగించేందుకు రామలింగారెడ్డి చివరివరకు పరితపించారని అన్నారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఏ దారి ప్రయాణించినా తన ముద్ర, తన అస్తిత్వం, తన ప్రత్యేకత నిలుపుకున్న గొప్ప వ్యక్తిత్వం రామలింగారెడ్డిది అన్నారు. టీయూడబ్ల్యుజె నేత విరాహత్ అలీ ప్రసంగిస్తూ రామలింగారెడ్డి జీవితం గురించి మాట్లాడుకోవడమంటే 35 ఏండ్ల మెతుకుసీమ పోరాటాల్ని నెమరేసుకోవడమేనన్నారు.
రామలింగారెడ్డి పేదల మనిషి