- వైరస్ వల్ల నొప్పి తెలియదు..!
న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):కరోనావైరస్‌కు సంబంధించిన పరిశోధనల్లో రోజురోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వ్యక్తుల్లో లక్షణాలేవిూ కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణముందని పరిశోధనల్లో తేలింది. వైరస్‌లోని ఒక రకమైన ప్రొటీను మనుషుల నాడీమండలానికి నొప్పి సంకేతాలను పంపే రిసెప్టర్లను నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు. అందుకే దాదాపు 50 శాతం మంది రోగుల్లో స్వల్ప లక్షణాలు ఉండటం లేదా అసలు లక్షణాలే బయటకు తెలియకపోవడం జరుగుతోందని గుర్తించారు. ఫలితంగా వారు వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నారు.అమెరికాలోని ఓ బృందం కొవిడ్-19 కారణమైన సార్స్ కోవ్ -2పై పరిశోధనలు చేసింది. ఈ బృందంలో యూనివర్శిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన డాక్టర్ రాజేష్ ఖన్నా కూడా ఉన్నారు. వీరి పరిశోధనను ది జర్నల్ పెయిన్ పత్రిక ప్రచురించింది. కొవిడ్ సోకిన రోగిలో తొలి లక్షణమైన నొప్పిని వైరస్ స్పైక్ ప్రొటీన్ తెలియనివ్వదు. నొప్పి సంకేతాలను శరీరానికి పంపించే సిగ్నలింగ్ వ్యవస్థను ఇది పూర్తిగా అచేతనం చేసేస్తుంది. దీంతో ఆ వ్యక్తికి ఎటువంటి నొప్పి తెలియదు.తొలుత శరీరంలోని ఏసీఈ2 రిసెప్టర్లను ఈ వైరస్ సోకుతుందని గుర్తించారు. మరో పరిశోధన ఫలితాలను జూన్ చివర్లో ది ప్రీప్రింట్ సర్వర్ బయోరిక్సివ్‌లో ప్రచురించారు. దీనిలో మాత్రం సార్స్ కోవ్-2 శరీరంలోని న్యూరోపిలిన్-1కు కూడా సోకుతుందని తేల్చారు. ఈ అంశం తమని ఆకర్షించిందని డాక్టర్ ఖన్నా పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి నొప్పి, నొప్పికి కారణం అయ్యే ప్రొటీన్లు, మార్గాలపై పరిశోధనలు చేస్తోందన్నారు. నొప్పి ప్రక్రియలో స్పైక్ ప్రొటీన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.శరీరంలోని వీఈజీఎఫ్-ఏ ప్రొటీను నొప్పి తెలియజేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్త నాళాల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. క్యాన్సర్, రూమటాయిడ్ ఆర్థ్రైటీస్‌లో కూడా దీనికి సంబంధం ఉంది. తాజాగా కోవిడ్‌కు ఈ ప్రొటీన్‌కు సంబంధం ఉంది. ఈ వీఈజీఎఫ్-ఏ ప్రొటీన్ శరీరంలోని న్యూరోపిలిన్ రిసెప్టర్‌పైన అతికినప్పుడు చాలా మార్పులు చోటు చేసుకోంటాయి. అప్పుడు శరీరానికి నొప్పి తెలుస్తుంది. వీఈజీఎఫ్-ఏ న్యూరోపిలిన్‌లో ఏ భాగానికి అతుక్కుంటుందో.. సార్స్‌కోవ్-2 స్పైక్ ప్రొటీన్ కూడా అదే భాగానికి అతుక్కుంటుంది. పరిశోధకులు న్యూరోపిలిన్‌పై తొలుత వీఈజీఎఫ్-ఏ ప్రొటీన్‌ను ప్రయోగించి నొప్పి కలిగించారు. తర్వాత అదే చోట సార్స్‌కోవ్-2 స్పైక్ ప్రొటీన్ ప్రయోగించారు. దీంతో వీఈజీఎఫ్-ఏకూ పూర్తి వ్యతిరేక ఫలితాను సార్స్‌కోవ్-2 స్పైక్ ప్రొటీన్ ఇచ్చింది. ఈ స్పైక్‌నును అత్యధిక డోసుల్లో లేదా అత్యల్ప డోసుల్లో ఉపయోగించి నొప్పిని పూర్తిగా తగ్గించవచ్చని డాక్టర్ ఖన్నా తెలిపారు. నాన్ ఓపియడ్ విధానంలో నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు న్యూరోపిలిన్‌ను లక్ష్యంగా చేసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు డాక్టర్ ఖన్నా తెలిపారు. కరోనావైరస్ వైద్యులకు నాన్ ఓపియడ్ విధానంలో నొప్పి నివారణకు అవసరమైన విధానాలను తెలియజేసిందని అన్నారు. న్యూరోపిలిన్‌పై పనిచేసేలా సహజసిద్ధమైన పదార్థాలతో చిన్న కణాలను తయారు చేయనున్నారు.