దేశంలో మరింత బలపడుతున్న బిజెపి పునాదులు


బీహార్‌ ఫలితంతో బెంగాల్లో పాగాకు యత్నాలు


దుబ్బాక ఫలితంతో తెలంగాణలో పాతుకు పోయే వ్యూహం


తమిళనాట రజనీ,కుష్బూల సాయంతో కాలుమోపే యత్నం


ఒకకో రాష్ట్రానికి ఒక్కో విధానంతో బిజెపి వ్యూహాత్మక అడుగులు


న్యూఢిల్లీ,నవంబర్‌11(జ‌నంసాక్షి): బీహార్‌లో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం, అలాగే అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం బిజెపి పునాదులు మరింత బలపడడానికి దోహదపడేవే. ప్రధానంగా దుబ్బకలో విజయం అన్నది తెలంగాణలో పార్టీ పునాదులు వేసుకునేందుకు మంచి ఊపు నిచ్చేదిగా చూడాలి. బిజెపి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వ్యూహం.. ఇదే బీజేపీ విజయరహస్యం. ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చాపకింద నీరులా ప్రచారం సాగించడం ఆ పార్టీ నైజం. దేశ రాజకీయాలను మలుపు తిప్పగల ఎన్నికలుగా భావించిన బిహార్‌లో బిజెపి గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించి ఎన్‌డిఎలో బలమైన పార్టీగా అవతరించింది. అక్కడ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇకపోతే ఎంతో ప్రాముఖ్యం ఉన్న మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల్లో జరిగిన 58 అసెంబ్లీ స్థానాల ఎన్నికల కంటె దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే ఆసక్తికరమైనదిగా సంచలనమైంది. అప్రతిహతంగా సాగుతున్న టిఆర్‌ఎస్‌ జైత్రయాత్రకు గట్టి కుదుపు ఎదురుకావడం బిజెపికి జోష్‌నింపేదిగా ఉంది. ఇది టిఆర్‌ఎస్‌ అపజయమా, లేక బిజెపి విజయమా?అని చర్చించుకుంటూనే ఉన్నారు. టిఆర్‌ఎస్‌ పరిపాలనా కారణంగా ఏర్పడిన ప్రతికూల ఓటు మాత్రమే అయినా దానిని క్యాష్‌ చేసుకోవడంలో బిజెపి ప్రభావం చూపింది. భారతీయ జనతాపార్టీ ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో క్రియాశీలంగా మారడంతో పాటు, ప్రభుత్వ విధానాల విూద ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటూ తనను తాను ప్రత్యామ్నా యంగా చూపుతూ వచ్చింది. దుబ్బాక ఫలితంలో బిజెపి పార్టీ నాయకత్వం, కార్యకర్తల శ్రేణులు, అభ్యర్థిఅందరూ తమ వంతు కష్టపడ్డారు. ప్రచారపర్వంలో అధికారపార్టీ వైపు నుంచి వచ్చిన విమర్శలు కూడా బిజెపికి సానుభూతిని పెంచాయి. తెలంగాణ పరిస్థితులను బిజెపి తనకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు అందుకు తగ్గట్లుగా ప్రజల్లోకి వెళుతోంది. ఈ దశలో కాంగ్రెస్‌ను విపక్షంగా లేకుండా చేయాలన్న లక్ష్యంతో బలహీనపరచడం ద్వారా టిఆర్‌ఎస్‌ కూడా ఈ పరిస్థితిని కొనితెచ్చుకున్నది. ఇకపోతే దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతాపార్టీయే అత్యధికంగా గెలిచి, తన సత్తాను మరోసారి ప్రకటించుకుంది. కరోనా వ్యాప్తి, రైతుచట్టాలు, ఆర్థికరంగ వైఫల్యాలు ఇవేవీ బిజెపి స్థితిని కొద్దిగా కూడా కదిలించలేకపోయాయి. ఎంతో కీలకమయిన బిహార్‌లో, ఫలితం ప్రతికూలం అయ్యే ప్రమాదం ఉండి కూడా, నితీశ్‌ కుమార్‌ బలాన్ని కుంచించివేసే రాజకీయ యుక్తిని కూడా బిజెపి ప్రయోగించింది. ఊహించి నంతగా తేజస్వి యాదవ్‌ రాణించలేకపోయారు. అందుకు కాంగ్రెస్‌ కూడా కారణంగానే చూడాలి. దానితో అంటకాగితే ఓటమి తప్పదని గుర్తించాలి. అధికారంలోకి అంటూ వస్తే, ఆ తరువాత బలం సమకూర్చు కోవడం బిజెపికి కష్టం కాదు. నిరుద్యోగం, వలసకార్మికుల సమస్యను ఎదుర్కొన్న తీరు నితీశ్‌ సర్కార్‌ను అప్రదిష్టపాలు చేశాయి. వాటితో పాటు, పదిహేనేళ్ల పాలన సహజంగానే కలిగించే విముఖత నితీశ్‌కున్న లోటుపాట్లను ప్రధాని మోదీ ప్రచారం భర్తీ చేసిందంటారు. ఇక ఇదే ఊపుతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించ నుంది. ముఖ్యంగా బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవడానికి బిహార్‌ ఫలితాలు కచ్చితంగా ఉపయోగ పడతాయని భావించాలి. ఇదే విధానంతో గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 ఎంపీ స్థానాల్లో అనూహ్యంగా 18 స్థానాలను గెలుచుకుని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను విస్మయపరచింది. నాటి నుంచి రాష్ట్రంలో బీజేపీ మరింత ఎదగకుండా టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో ఢీకొట్టడానికి కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షాయే స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఆ రాష్ట్రంలో రెండ్రోజులపాటు పర్యటించారు. బెంగాల్లో అవినీతి, శాంతిభద్రతలు, బీజేపీ కార్యకర్తల హత్యలపై విరుచుకుపడ్డారు. 2021లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవడానికి ఏయే వ్యూహాలు అనుసరించాలో బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశర చేశారు. ఇప్పటికే బీజేపీ నేతలు.. టీఎంసీ, కాంగ్రెస్‌, వామపక్షాల్లో అసంతృప్తికి లోనవుతున్న నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు బిహార్‌ ఫలితాలతో అక్కడా బీజేపీకి సానుకూల వాతావరణం నెలకొంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. తమిళనాడులో పాగాకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనతో పూరించాలని చూసింది. పాలక అన్నాడీఎంకేను కూడా చీల్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆ పార్టీకి దన్నుగా నిలబడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీచేసినా.. బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను పదునుపెడుతోంది. ఇందులో భాగంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వంటి వారిని తమ పార్టీ వైపు ఆకర్షించాలని భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోయినా.. గణనీయమైన సీట్లు సాధించి తన ప్రాభవాన్ని చాటుకోవాలని చూస్తోంది. అన్నాడీఎంకే తో జట్టుకట్టి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆ పార్టీ వ్యూహకర్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కుష్బూలాంటి వారిని చేర్చుకోవడం కూడా ఇందులో భాగంగానే చూడాలి.