గవర్నర్‌కు సిఫార్సు చేసిన తెలంగాణ కేబినేట్
గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ పేర్లు ఆమోదం
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): గవర్నర్ కోటాలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరుగుతున్న సమావేశంలో పేర్లను ఖరారు చూస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. వీరి అభ్యర్థిత్వాలను ఆమోదించగానే వారు శనివారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ కోటలో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సారయ్య పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్యకు అవకాశం కల్పిస్తూ టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.