గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌,బిజెపిల మధ్యే ప్రధాన పోటీ

పలు ప్రాంతాల్లో పోటీ ఇస్తున్న కాంగ్రెస్‌
మొత్తంవిూద త్రిముఖ పోటీతో సర్వత్రా ఆసక్తి
సెటిలర్స్‌ ఓట్లపై అన్ని పార్టీల గురి
హైదరాబాద్‌,నవంబర్‌30 (జనం సాక్షి):  గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. కొన్నిచోట్ల మజ్లిస్‌ కారణంగా చతుర్ముఖ పోటీ కూడా ఉంది. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్‌, బిజెపిల మధ్యనే పోటీ నెలకొంది. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే నువ్వా నేనా.. అనేలా పోటీ ఉండగా.. అక్కడక్కడా కాంగ్రెస్‌ పోటీ ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అభివృద్ధి పథకాలు, సిట్టింగ్‌లు, క్యాడర్‌  టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా  ఉండగా.. వరదలు, రూ.10 వేల ఆర్థిక  సాయం, దుబ్బాక ఓటమి  బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా చూస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు సెటిలర్లు టిఆర్‌ఎస్‌కు ఓటేస్తూ వచ్చారు. ఈ సారి ఎవరికి ఓటేస్తారన్నది చర్చగా మారింది. వివిద ప్రాంతాల్లో వారి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కూకట్‌పల్లి, కొంపల్లి, అవిూర్‌ పేట తదితర ప్రాంతాల్లో వారిదే పైచేయిగా ఉంది. వారి ఓట్ల కోసం నేతలు తీవ్రంగా పాటుపడ్డారు. పాతబస్తీలో అత్యధిక స్థానాలు మజ్లిస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సెటిలర్లు, ఉత్తర భారతీయులు, ముస్లిం మైనార్టీ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపినా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో  కేపీహెచ్‌బీ డివిజన్‌ మినహా మిగిలిన అన్ని డివిజన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కేపీహెచ్‌బీలో టీడీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కేపీహెచ్‌బీ కాలనీలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీకి ¬రా¬రీ పోరు నడుస్తోంది. తలసాని ప్రతానిధ్యం వహిస్తున్న నత్‌నగర్‌  నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయి. సనత్‌నగర్‌, అవిూర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేటలతో పాటు మోండా(పార్ట్‌) డివిజన్లు విస్తరించి ఉన్నాయి. సనత్‌నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ డివిజన్‌లో సెటిలర్స్‌ ఓటు బ్యాంక్‌ కీలకం.  అవిూర్‌పేట డివిజన్‌కు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌?బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నార్త్‌ ఇండియన్స్‌ ఓటు బ్యాంకుపై తమకే అన్న ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు. సెటిలర్స్‌ బీజేపీ వైపు మొగ్గు చూపుతారన్న భావనలో ఉన్నారు. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో ఏడు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. ఓవరాల్‌గా ఎక్కువ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఉత్తరాదివారు  పోలింగ్‌లో పాల్గొంటేనే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుంది. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఖైరతాబాద్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ చాపకింద నీరులా కొంత విస్తరిస్తోంది. హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్లుగా పోరు సాగుతోంది. అత్యధికంగా వ్యాపారులు, కాలనీలు, ఉన్నత విద్యావంతులు ఉండటంతో వారు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సికింద్రా బాద్‌లోని అనేక డివిజన్లలో పోటీ టిఆర్‌ఎస్‌, బిజెపిల మధ్యనే 
ఉంది. స్థానిక ఎమ్మెల్యే సాయన్న తన కూతురు లాస్యనందిత పోటీ చేస్తున్న ముషీరాబాద్‌ నియోజకవర్గం లోని కవాడిగూడ డివిజన్‌లో ప్రచారానికే పరిమతం అయ్యారు. మూసారంబాగ్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లు ఉన్నాయి. బేగంబజార్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సికింద్రాబాద్‌  నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. తార్నాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మోతె శ్రీలతారెడ్డి, బీజేపీ అభ్యర్థి బండ జయసుధరెడ్డి మధ్యే పోటీ.. బౌద్ధనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంది శైలజ, బీజేపీ అభ్యర్థి మేకల కీర్తి మధ్య పోటీ ఉంది. ఐదు డివిజన్లలో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. బస్తీల ఓట్లు కీలకంగా మారనున్నాయి.  కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం ఎనిమిది డివిజన్లు ఉండగా ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. కొన్నిచోట్ల ద్విముఖ పోటీ నెలకొనగా, మరికొన్ని డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొంది. అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. కాచిగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌ రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉండటంతో బీజేపీ కాస్త అనుకూలంగా మారినా పోటీ తీవ్రంగానే ఉంది.నల్లకుంట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంది. ఉప్పల్‌ నియోజకవర్గంలో పది డివిజన్లు ఉన్నాయి. కాప్రా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం కోసం కష్టపడుతున్నా.. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ అధికంగా ఉంది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. భోలక్‌పూర్‌ డివిజన్‌లో మాత్రం ఎంఐఎం, టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఐదు డివిజన్లు ఉన్నాయి. రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ ఉంది. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉంది. అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా..? అనే రీతిలో ప్రచారంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.  వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి,  గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్‌లలో ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. మల్కాజిగిరి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థి జగదీష్‌గౌడ్‌ రెండవసారి పోటీ చేస్తుండగా.. బీజేపీ అభ్యర్థి వూరపల్లి శ్రవణ్‌ మొదటిసారి పోటీలో ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి.