వరదబాధితులకు దమ్మడీ కూడా ఇవ్వని కేంద్రం


ఒత్తిడితెచ్చి వరదసాయం నిలిపివేశారు


పోటీ కాంగ్రెస్‌తోనే..బిజెపితో కాదు


104 స్థానాల్లో విజయం సాధిస్తామన్న మంత్రి తలసాని


హైదరాబాద్‌,నవంబర్‌18  (జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో వరదలు వచ్చిన నెలరోజుల తర్వాత బృందాన్ని పంపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. కేంద్రబృందం వచ్చినా దమ్మిడీ కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. నగరంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం ప్రకటించిందని చెప్పారు. ఆర్థిక సాయం కోసం 'విూసేవ' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించామని.. అర్హులందరికీ సాయం అందించాలనే ఆవిధంగా చేశామని చెప్పారు. ఇప్పటివరకు నేరుగా 4,75,781 మంది బాధితులకు సాయం అందజేశామన్నారు. మూడు రోజుల్లో 1.65లక్షల దరఖాస్తులు వచ్చాయని.. ఇప్పటికే లబ్దిదారుల ఖాతాల్లో రూ.165కోట్లు జమ చేశామని తలసాని వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వరద సాయం నిలిపివేయించారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందజేయనున్నట్లు సీఎం చెప్పారని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తలసాని స్పష్టం చేశారు. ప్రజలకు కాంగ్రెస్‌, భాజపా ఏం చేశాయో చెప్పాలని ఆయన నిలదీశారు. ఆ రెండు పార్టీలకు 75 స్థానాలకూ అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి అయిన తర్వాత ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్టాన్రికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని.. సుమారు రూ.70వేల కోట్లతో హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు చేపట్టామని తలసాని వివరించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఒక్కరోజులో పూర్తికావని.. ఆలస్యమైనా వాటిని పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కొందరికి తప్ప సిట్టింగులు అందరికీ అవకాశముంటుందని స్పష్టం చేశారు. తమది ఫుల్‌ లోడ్‌ బండి అని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించారు. 150 డివిజన్లలోనూ పోటీచేసి.. 104 సీట్లలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే ఉంటుందని చెప్పారు.


--------------