ఇచ్చిన హావిూలను తులంగలో తొక్కారు
డబుల్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంపి అర్వింద్ విమర్శలు
హైదరాబాద్,నవంబర్29 (జనం సాక్షి): సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ప్రజలకు విశ్వాసం పోయిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బోరబండలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఎందుకివ్వలేదని నిలదీశారు. అగ్రవర్ణ పేదలకు మోదీ 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎల్బీస్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాత స్పీచ్‌నే మళ్లీ చదివారని ఎంపీ అరవింద్ విమర్శించారు. ఇకపోతే ప్రజలకు అబద్దాలు చెప్పడంలో తండ్రీ, కొడుకులు పోటీపడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం నిధులపై టీఆర్‌ఎస్ పార్టీవి తప్పుడు లెక్కలని దుబ్బాక ప్రజలు నిరూపించారని అన్నారు. టీఆర్‌ఎస్ అడ్డా దుబ్బాకను బద్దలు కొట్టామని, ఇప్పుడు గ్రేటర్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా అబద్దాలు ప్రచారం చేయడంలో దిట్టని విమర్శించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు.. అవాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారన్నారు. అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు. బుధవారం నాడిక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో పేదలకు లక్ష ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆరేళ్లు అయినా ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రజలు ప్రభుత్వంపై అక్రోషంగా ఉన్నారన్నారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.224 కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ.202 కోట్లు మంజూరు చేసిందన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధితులకు రూ.10వేలు
ఇస్తోందన్నారు. అబద్దాలు చెప్పడంతో కేటీఆర్ తండ్రిని మించిపోయారన్నారు. విపత్తులు వచ్చినపుడు ఏంచేయాలో ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాలని సూచించారు.
కెసిఆర్,కెటిఆర్‌లపై ప్రజలకు విశ్వాసం పోయింది