వీరజవాన్‌కు ప్రజలు,నేతలు కన్నీటి వీడ్కోలు
పాడెమోసి అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి వేముల, ఎంపి అర్వింద్
విమనాశ్రయంలో నివాళి అర్పించిన గవర్నర్ తదితరులు
నిజామాబాద్,నవంబర్11(జనంసాక్షి): వీర జవాన్ ర్యాడ మహేశ్‌కు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లాలోని మహేశ్ స్వగ్రామమైన కోమన్‌పల్లిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
సరిహద్దులో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మహేశ్ పార్ధివదేహాంపై జాతీయ జెండాను ఉంచిన అధికారులు ఆ తర్వాత నివాళులర్పించారు. వీరమరణం పొందిన జవాన్ మహేశ్‌కు చివరి సారిగా కుటుంబ సభ్యులు, నేతలు నివాళులర్పించారు. బీజేపీ ఎంపీ అర్వింద్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. జవాన్ మహేశ్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార సైనిక లాంఛనాల మధ్య వీర జవాన్ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ నెల 8న జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిన్ సెక్టార్‌లో ముష్కరులను అసమాన సాహసంతో ఎదిరించి, మహేశ్ వీరమరణం పొందిన విషయం విదితమే.
అమరజవాన్ ర్యాడ మహేశ్ పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో మంగళవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమరవీరుడికి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మహేశ్ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం, కోమన్‌పల్లి గ్రామానికి తరలించారు. సైనికుడు ర్యాడ మహేశ్ మృతికి ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అతని కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా మని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సైనికుడు మహేశ్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించి భారతమాత ఒడికి చేరిన యోధుడిగా మహేశ్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారని సీఎం కేసీఆర్ కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. మహేశ్ కుటుంబానికి ఇంటిస్థలం కూడా కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ అంతిమయాత్ర అశ్రునయనాలతో ప్రారంభమైంది. అనంతరం వేల్పూర్ మండలం, కోమన్‌పల్లిలో వీరజవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమ యాత్రలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ అరవింద్, జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోమన్‌పల్లి గ్రామానికి బుధవారం తెల్లవారుజామున మహేష్ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థివదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జయ¬ జవాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మధ్యాహ్నం మహేష్ మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్ కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ పరామర్శించారు. అంత్యక్రియ ఏర్పాట్లను ఆర్మీకి చెందిన మద్రాస్ రీజ్‌మెంట్ అధికారులు పర్యవేక్షించారు.