గిరిజనలును మోసం చేసిన కెసిఆర్‌


12శాతం రిజర్వేషన్ల హావిూని తుంగలో తొక్కారు: బండి


హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి) :  గిరిజనులను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. గిరిజనలుకు 12శాతం రిజర్వేషన్ల హావిూని తుంగలో తొక్కారని అన్నారు. వారికోసం బిజెపి పోరాడుతుందని అన్నారు. పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడిగా హుస్సేన్‌ నాయక్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా బండి మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఉన్నా.. మోదీ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు. కేంద్ర ప్యాకేజీ తప్ప.. కేసీఆర్‌ ప్రజలకు చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.  కేసీఆర్‌ గతంలో పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ అని 


విమర్శించారు.  బీసీలపై ప్రేమ ఉంటే టీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌లో కేసీఆర్‌ బిడ్డను.. దుబ్బాకలో అల్లుడిని ఓడించామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌ బాక్స్‌ బద్దలు కొడతామని బండి సంజయ్‌ హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు చెంచాగాళ్లు.. ఎందుకా బతుకు బతుకుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ బీసీలను అణగదొక్కుతూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని తప్పుబట్టారు. దుబ్బాక ప్రజల స్ఫూర్తితో గ్రేటర్‌ ప్రజలు బీజేపీని గెలిపించాలని బండి సంజయ్‌ అభ్యర్ధించారు. రాష్ట్రంలో బలమైన టీఆర్‌ఎస్‌ను ఢీకొంటూ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా అసాధారణ విజయాన్ని బండి సంజయ్‌ సొంతం చేసుకున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని 8నెలల్లోనే నిలబెట్టుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, రథసారథిగా తొలి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. సీనియర్‌ నేతల అభిప్రాయాలను గౌరవిస్తూ, కేడర్‌కు పక్కాగా దిశానిర్దేశర చేస్తూ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా యువతలో అనూహ్య క్రేజ్‌ సంపాదించుకున్న సంజయ్‌ వారి అంచనాలకు తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.