దీపాల వెలుగుతో పండగ చేద్దాం
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): కరోనా నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని పండగల్లాగే దీపావళి కూడా ఇంటికే పరిమితం కానుంది. బాణాసంచా కాల్చితేనే దీపావళి కాదు. అయితే దీపవాళి ప్రత్యేకతే వేరు. దీపాలతో ఇల్లంతా వెలగించి కొత్త కాంతులను ఆహ్వానించడం ద్వారా పండగ జరుపుకోవాలి. అలాగే కరోనా వేళ కలసి పండగ జరుపుకోవాలని, బాణాసంచా కాల్చాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. కరోనా వ్యాక్సిన్ రావడానికి మరో నాలుగైదు నెలలు పట్టనుంది. ఇప్పటికే ప్రయోగదశలు విజయవంతం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలదేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో శ్రమిస్తున్నాయి. ఈదశలో మరోమారు కరోనా హెచ్చరికలు పాటిస్తూ దీపావళి రోజు దీపాలు వెలిగించి, లక్ష్మీపూజలతో, ఇంటి పిండివంటలకే ప్రాధాన్యం ఇస్తూ పండగ జరుపుకోవడం ఉత్తమం. ఏటా దీపావళి పర్వదినాన్ని పిల్లాపెద్దలు కసలి ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి గెలుపునకు చిహ్నంగా దీపాల పండుగను జరుపుకొంటారు. దీపాల పండుగ వేడుకలకు ప్రజలు ముందుగానే దీపాలు వెలిగించేందుకు సిద్దం కావడం ఈ యేడాది విశేషంగా చెప్పుకోవాలి. తగంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ప్రజలు దీపాలను వెలిగించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు మహిళలు ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో కాలుష్యం పెరిగితే కొవిడ్ విజృంభిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు గ్రీన్ దీపావళి జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పటాసులు కొనుగోలు చేయకుండా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కరోనా దెబ్బంతో వెలుగుల పండుగ దీపావళి కళతప్పుతోందన్న భావన రాకుండా దీపాలను వెలగించి పూజలలో భక్తిప్రపత్తులు చాటడం ముఖ్యం. అయితే తారాజువ్వల వెలుగులు, టపాసుల మోతలతో సందడిగా సాగాల్సిన పండుగ రోజు ఈసారి నిశబ్దంగా గడిచిపోనుందన్న భావన పిల్లల్లో ఉండడం సహజం. కరోనా వ్యాప్తి నేపధ్యంలో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై హైకోర్టు నిషేదం విధించడంతో పిల్లలకు పండుగ సందడి కనుమరుగైంది. ఏటా పండుగకు వారం ముందునుంచే బాణాసంచా విక్రయాలతో సందడి ప్రారంభమవుతుంది. కానీ ఈ సంవత్సరం టపాసుల దుకాణాలపై నిషేధంతో అంతటా స్తబ్దత నెలకొంది. కోవిడ్ 19 నేపథ్యంలో దీపావళి టపాసులను అమ్మవద్దని, హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో దీపావళి టపాసులు విక్రయించే దుకాణాలకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో బాణాసంచా కోసం అడ్వాన్సులు చెల్లించిన వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే లైసెన్సుకోసం పోలీసుశాఖకు అగ్నిమాపకశాఖకు చలానాలు చెల్లించారు. అంతేకాకుండా సరుకు దిగుమతి కోసం గోదాముల యజమానులకు డబ్బు చెల్లించినట్టు వ్యాపారులు వాపోతున్నారు. దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు సన్నద్దమవ్వగా చివరి నిమిషంలో అనుమతి నిరాకరణతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దుకాణాలకు అనుమతి పక్రియలో భాగంగా ఒక్కో దుకాణదారుడు రూ.30వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఒక్కో దుకారణదారుడు సుమారు లక్ష నుంచి రూ.5లక్షల వరకు బాణసంచా కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దుకాణాలకు అనుమతి నిరాకణతో ఈ పెట్టుబడంతా తమకు తీవ్ర నష్టంగా మారనుందని వ్యాపారులు వాపోతున్నారు. టపాసుల విక్రయాలు, నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో బాణాసంచా దుకాణదారులు లబోదిబోమంటున్నారు. అన్ని అనుమతులు వచ్చి ఆఖరి నిమిషంలో హైకోర్టు తీర్పుతో విక్రయాలకు బ్రేక్ పడడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోనున్నారు.
----------------