ఎన్నికల విధుల్లో పరస్పర అవగాహన ముఖ్యం


పోలీస్‌ ఉన్నతాధికారులతో పార్థసారథి చర్చలు


హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసులకు మధ్య పరస్పర అవగాహన, సమన్వయం అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారధి అన్నారు. శనివారం ఎన్నికల సంఘం కార్యాలయంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసి పరిధిలో 150 వార్డులు నాలుగు జిల్లాల్లో కలిసి ఉన్నాయని అన్నారు. ఆరు జోన్లు, ముప్పయ్‌ సర్కిళ్లలో కలిపి 74లక్షల ఓటర్లు, 8వేల పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడడంతోపాటు స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అన్నారు. ఎన్నికల సమయంలో లైసెన్స్‌ లేని ఆయుధాలను సీజ్‌ చేయాలని, లైసెన్స్‌ కలిగిన వారు తమ ఆయుధాలను ఎన్నికల పక్రియ ముగిసే వరకూ సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని సూచించారు.


బీట్‌ పెట్రోలింగ్‌ పెంచాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని పేర్కొన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో కలిసి సమస్యాత్మక , అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయిన రోజు నుంచి మున్సిపల్‌ సర్కిల్‌లలో పరిస్థితులను బట్టి తగినన్ని స్టాటిక్‌సర్వేలెన్స్‌ టీమ్‌లు, ప్లయింగ్‌స్క్వాడ్స్‌, చెక్‌పోస్టులు, పోలీస్‌ పికెటింగ్‌లు ఏర్పాటు చేయాలసి ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఎ/-లాన్‌ తయారు చేయాలని, సమస్యలు సృష్టించే అరాచక శక్తులపై 24గంటలూ నిఘా


పెట్టాలన్నారు. ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించాలని, రౌడీ మేకలు చెలరేగకుండా చూడాలన్నారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసి కమిషనర్‌లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, సైబరాబాద్‌కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, అడిషనల్‌ డీజీపీ (శాంతి భద్రతలు)జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.