నగర ఓటర్లకు బాహాటంగా డబ్బుల పంపిణీ


అధికార పార్టీ నేతల తీరుపై బిజెపి ఆగ్రహం
ఎన్నికల కార్యాలయం ముందు  నేతల ఆందోళన
రగంలోకి దిగి నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు
హైదరాబాద్‌,నవంబర్‌30 (జనం సాక్షి):  గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం ముగియడంతో నేతలు ప్రలోభ పర్వానికి తెరతీసారు. నగరంలో అధికార టిఆర్‌ఎస్‌  పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బిజెపి ఆందోళనకు దిగింది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట బీజేపీ 
నేతలు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రా రావు, సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతుంటే అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైనే లాఠీచార్జ్‌ చేస్తున్నారన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు పంచుతున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఓటు కోసం రూ.500 తీసుకుంటే.. ఐదేళ్లు గులాంగిరి చేయాలని రాజాసింగ్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే బిజెపి ఆరోపణలను టిఆర్‌ఎస్‌ తిప్పికొట్టింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నిన్నటిదాకా విద్వేశాలను రెచ్చగొడుతూ, ఒక వర్గంవారి ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించిందని మండిపడింది. సోషల్‌ విూడియాలో అసత్య ప్రచారం చేస్తూ, జాతీయ నేతలను హైదరాబాద్‌ గల్లీల్లో తిప్పితూ ఓటర్లను తమవైపు ఆకర్షించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రచారపర్వం ముగియడంతో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆ పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయింది వారేనని అన్నారు. తాజాగా ఓటర్ల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి కమలం పార్టీ కొత్త నాటకాలకు తెరతీసిందన్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని, ప్రభుత్వానికి అనుకూలంగా పనుచేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట హంగామా సృష్టించడం దారుణమన్నారు.