వీరజవాన్‌ ప్రవీణ్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు


సొంతూరులో భారీగా తరలివచ్చి నివాళి అర్పించిన జనం


చిత్తూరు,నవంబర్‌11(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన వీర జవాను   ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన జవాన్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కుటుంబసభ్యులు కన్నీటితో ప్రవీణ్‌కు తుది వీడ్కోలు పలికారు. బుధవారం ఉదయం ప్రవీణ్‌ భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు నివాళులర్పించారు.  వీర జవాన్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని  కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి  మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం మృతి చెందిన ప్రవీణ్‌ మృతదేహాన్ని సోమవారమే తీసుకురావాల్సి ఉండగా మంచు కారణంగా వీలుపడలేదు. ఢిల్లీ నుంచి ప్రవీణ్‌ మృతదేహంతో మంగళవారం సాయంత్రం బయల్దేరిన విమానం తిరుపతి విమానాశ్రయానికి రాత్రి 11.45గంటలకు చేరుకుంది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సురేష్‌,ఆర్డీవో కనకనరసా రెడ్డి,డీఎస్పీ చంద్రశేఖర్‌ తదితరులు ప్రవీణ్‌కు ఘనంగా నివాళులర్పించాక రెడ్డివారిప్లలెకు పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. ప్రవీణ్‌ దహన సంస్కారాలను 


బుధవారం మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో నిర్వహించారు.ఉగ్రవాదులతో పోరాటంలో వీర మరణం పొందిన ప్రవీణ్‌ తమ గ్రామానికి గౌరవంతెచ్చాడని పలువురు నివాళి అర్పించారు.  తామంతా తలెత్తుకు జీవిస్తామన్నారు.