వ్యూహాత్మక తప్పదాలుచేస్తున్న విపక్ష పార్టీ
హైదరాబాద్,నవంబర్11(జనంసాక్షి): దుబ్బాక ఎన్నికల ఫలితం ఓ రకంగా కాంగ్రెస్ వ్యూహాత్మక లోపాలను ఎత్తి చూపింది. ఎన్నికల సందర్భంగా అప్పటికప్పుడు ఆలోచన చేసి ముందుకు సాగాలన్న తీరుతో ఆ పార్టీ నడుస్తోంది. దుబ్బాకలో బలమైన అభ్యర్థిగా చెరుకు ఎనివాసరెడ్డి నిలబడ్డా అంతకుముందు టిఆర్‌ఎస్‌లో ఉండడం అన్నది కలసిరాకుండా పోయింది. నాయకులంతా దుబ్బాకలో పనిచేసినా గెలుపు తీరాలకు చేరలేదు. అలాగే గౌరవప్రదమైన మూడోస్థానం కూడా సంపాదించలేదు. ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతగా ఒక్కొక్కరిని తయారుచేసి వారిని ఆ ప్రాంతానికే పరిమితం చేసే కార్యాచరణ లోపించింది. అలాగేసమర్థ నాయకత్వ లోపం కూడా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవసరంకాంగ్రెస్ నాయకత్వమంతా బూత్ స్థాయి వరకూ బాధ్యత తీసుకున్నామనిచెబుతున్నా దుబ్బాకలో తృతీయ స్థానంలోనే మిగిలిపోవడం గమనార్హం. అది కూడా రెండో స్థానానికి దగ్గరగా మూడో స్థానం లేదు. ఈ దవలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో తమను ప్రత్యామ్నాయం చేస్తుందని చెప్పుకోవడం మినహా వ్యవూహాత్మకత లోపించిందని చెప్పాలి. జిహెచ్‌ఎంసి ఎన్నికలు, రెండు శాసనమండలి స్థానాల ఎన్నికలు వస్తున్న వేళ కాంగ్రెస్ ఓటమికి సంబంధించి సవిూక్షించుకోవాలి. అధికార తెలంగాణ రాష్ట్రసమితికి దుబ్బాక ఫలితం ఎంత ఊహించనిదో అలాగే కాంగ్రెస్ పురోగతికి కూడా అంతే షాక్ ఇచ్చే అంశం. విజేత అయిన భారతీయ జనతాపార్టీకి ఇది కీలకమయిన గెలుపు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని, గతంలో టిఆర్‌ఎస్‌లో కూడా పనిచేసిన ప్రస్తుత బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు ఇది ప్రతిష్ఠాత్మక విజయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్ గమనానికి బీజాలు ఈ ఉప ఎన్నికలో కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా పెద్ద ప్రతిపక్షంగా, ప్రత్యామ్నాయంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఫలితం గుణపాఠం కావాలి. దుబ్బాక ప్రచారంలో, పోలింగ్ నిర్వహణలో మునుపెన్నడూ చూడనంత క్రియాశీలంగా కాంగ్రెస్ కనిపించిందని జనం చెప్పుకున్నారు కానీ, రాజకీయ కార్యాచరణ అన్నది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చేపట్టేది కాదు. అది ఎల్లవేళలా ఉండాలని, అలా లేకుంటే గాలివాటం గెలుపు సాధ్యం కాదని కాంగ్రెస్ గుర్తించి మససుకోవాలి.