అధికార పార్టీలో ఇప్పటి నుంచే లాబీయింగ్
జనరల్ స్థానంలో గెలిపంచుకునేందుకు ప్రయత్నాలు
హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో మేయర్ ఎవరన్నది చర్చ మొదలయ్యింది. జనరల్ మహిళకు మేయర్ పీఠం రిజర్వ్
కావడంతో ఆయా పార్టీల్లో ఉన్న నేతలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. మరోవైపు గతంలో మేయర్‌గా పనిచేసిన బండా కార్తీకరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాగే ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తన భార్యను బరిలోకి దింపాలని చూస్తున్నారు. దీంతో మేయర్ పీఠం కోసం అధికార టీఆర్‌ఎస్‌లో లాబీయింగ్ మొదలైంది. జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో పెద్దలు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మేయర్ పీఠంపై పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంటుందని చర్చ మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరితో ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం ముగుస్తుంది. షెడ్యూల్ కంటే ముందుగానే గ్రేటర్ పోరు రావడంతో రాజకీయ వర్గాల్లో మేయర్ పీఠంపై చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో ఇప్పటి వరకూ ఇద్దరు మహిళలు మేయర్‌గా పనిచేశారు.వారిలో ఒకరు సరోజిని పుల్లారెడ్డి మరొకరు బండ కార్తీక్‌రెడ్డి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో మేయర్ పీఠం బీసీలకు రిజర్వ్ అయింది. ఆ విధంగా బొంతు రామ్మోహన్ మేయర్‌గా ఉన్నారు. ఇప్పుడు జనరల్ మహిళకు కేటాయించడంతో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చాలా మంది రంగంలోకి దిగారు. గెలుపు గ్యారెంటీగా ఉండే డివిజన్‌ను చూసుకుని ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నారు. కార్పొరేటర్ టికెట్ల కోసం ఇప్పటికే పోటీ నెలకొనగా.. మేయర్ పీఠంపై మిగతావారు ఫోకస్ పెట్టారు. మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చాలా మంది అక్కడ కర్చీఫ్ వేసేందుకు లాబీయింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. గ్రేటర్ మేయర్ పీఠం తెలంగాణలో పెద్ద పదవిగానే భావించాలి. కాలం కలిసి వస్తే రాజకీయంగా ఇంకా పైకి ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు.. మేయర్‌గా రాజధాని హైదరాబాద్ నగరంలో పెత్తనం చేయొచ్చు. ఇలా అనేక లెక్కలు వేసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు ఈసారి ఛాన్స్ వదులుకోకూడదని భావిస్తున్నారు. భార్య లేదా తమ బంధువులయిన మహిళ లను ఎన్నికల గోదాలోకి దించేందుకు అన్నిరకాల అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులు అధిష్ఠానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు సరిగా లేనివారికి మళ్లీ ఛాన్స్ ఉండదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాంటి చోట ఏది వర్కవుట్ అవుతుందో క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారట. ఈ మేరకు డివిజన్లలో పార్టీ చేస్తున్న సర్వేపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్‌ఎస్‌కు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారిలో కొందరు కీలక స్థానాల్లో ఉన్నారు. ప్రభుత్వంలో చురుకుగా పనిచేస్తున్నారు. వారంతా ఏదో విధంగా మేయర్ పీఠం వశపర్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఈసారి మేయర్ సీటు కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ తప్పదని అనుకుంటున్నారు. గత ఎంపి ఎన్నికల్లో కొడుకును, అల్లుడిని బరిలోకి దింపిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డిలు కూడా తమ ఇంటి నుంచి ఎవరినైనా బరిలోకి దింపుతారని తెలుస్తోంది. అయితే ఇందుఉకోసం ముందుగా జనరల్ స్థానం నుంచి వారిని గెలిపించుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని150 కార్పొరేటర్లలో 30 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఎన్నికలో నేర చరిత్ర ఉన్నోళ్లకు టికెట్లు ఇవ్వరాదనిఆయా పార్టీలను డిమాండ్ చేసింది. నేర చరిత్ర లేనోళ్లనే కార్పొరేటర్లుగా నిలబెట్టాలని కోరింది. సమస్యలపై చర్చించేవాళ్లనే కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేరస్తులను నిలబెట్టడం వల్లే పట్టణాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతోందని పద్మనాభరెడ్డి చెప్పారు. అలాంటి వాళ్లకు ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదన్నారు. 2016 ఎన్నికల్లో పోటీచేసిన 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. వీరిలో 30 మంది గెలిచారన్నారు. వీళ్లలో టీఆర్‌ఎస్ నుంచి16, ఎంఐఎం నుంచి 13, బీజేపీ నుంచి ఒకరు పాలకవర్గంలో ఉన్నారన్నారు. ఈ నాలుగేళ్లలో మరో 17 మందిపై కేసులు నమోదయ్యాయి. వీటిపై నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.