మరోమారు గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన బ్రదర్స్
కింగ్ మేకర్ స్థానంలోకి వచ్చేలా యత్నాలు
హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలు మారుస్తూ మజ్లిస్ తన పునాదిని పటిష్టం చేసుకుంటోంది. గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా బల్దియా పీఠంపై గురి పెట్టింది. బేరమాడడానికి తగిన సీట్లను సంపాదించాలన్న పట్టుదలో పార్టీ నేతలు ప్రచారం నిర్వహిం చారు. అనుకున్న సీట్లలో గెలిచి సత్తా చాటుతామనే అంచనాల్లో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహం. గతంలో కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకపోవటంతో మజ్లిస్ సాయం తీసుకుంది. దీంతో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్‌తో కలసి మజ్లిస్ పంచుకుంది. ఇప్పుడు కూడా అలాంటి చాన్స్ రావాలని కోరుకుంటోంది. టీఆర్‌ఎస్‌కు తక్కువ సీట్లొస్తే తాను కింగ్‌మేకర్ కావచ్చన్నది ఆ పార్టీ నేతల భావనగా ఉంది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గౌలీపురా, ఘాన్సీబజార్, బేగంబజార్‌లలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ రెండుచోట్లా పాగా వేయాలని మజ్లిస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పోటీ పడే స్థానాల మొదలు ప్రచార పర్వంలోనూ ఎంఐఎం నేతలు వ్యూహాత్మకంగా ప్రచారాన్ని చేపట్టారు. ఈసారి మజ్లిస్ పోటీ చేస్తున్న డివిజన్లు 51 మాత్రమే.. అయినా కనీసం 40 దక్కినా మేయర్ పీఠంపై గురి పెట్టవచ్చని చూస్తోంది. పక్కా ప్రణాళికతో ప్రచారం సాగించిన ఆ పార్టీ.. సదరు డివిజన్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటోంది. ముస్లిం మైనార్టీలకు అనుకూలంగా ఉంటుందన్న ముద్ర ఆ పార్టీపై బలంగా ఉంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు, అవగాహన ఏమాత్రం లేదని ప్రజలకు చెప్పేలా ప్రచారంలో ఎదురుదాడితో పాటు, విమర్శలు చేసింది. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలి పోతుందన్న మాటలు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి వినవచ్చాయి. అంతేకాక టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను అనుభవం లేని వ్యక్తిగా పేర్కొనడం కూడా ఇందులో భాగంగానే చూడాలి. అలాగే బీజేపీ సంధించే విమర్శలను తన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడిన 'పాతబస్తీపై సర్జికల్ స్టయ్రిక్ మాటలను తనకు అనుకూలంగా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అసదుద్దీన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో దీన్ని బాగా వాడుకున్నారు. రోహింగ్యాలు ఉంటే ఏం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు.
రాజకీయ వ్యూహాలు మార్చడంలో మజ్లిస్ దిట్ట