తెలంగాణ ఉద్యమకారుల కోసం బిజెపి వేట


త్వరలోనే కమలం గూటికి రానున్న విజయశాంతి


రానున్న గ్రేటర్‌ ఎన్నికలు లక్ష్యంగా కమలదళం వ్యూహం


హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులను చేర్చుకోవడం ద్వారా మరింతబలపడాలని తెలంగాన బిజెపి భావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టిందని తెలుస్తోంది. దుబ్బాక గెలుపు తరవాత రఘునందన్‌ రావు ఇదే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయశాంతిని మళ్లీ వెనక్కి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆమె కూడా పార్టీలో తిరిగి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌ నేత విజయశాంతి త్వరలో పార్టీని వీడి బిజెపిలో చేరనున్నారన్న ప్రయచారం దుబ్బాక ఫలితం తర్వాత జోరందుకుంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 14న ఆమె ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు సాధించడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పులు చోటుచేసు కుంటున్నాయి. కాంగ్రెస్‌ నేతలు వరుసగా బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ నేత కుష్బూ బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె బాటలోనే విజయశాంతి కూడా బిజెపి గూటికి చేరనున్నట్లు సమాచారం. బిజెపి నేతలు కూడా ఈ అంశంపై విజయశాంతితో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. తొలుత విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బిజెపితోనే ప్రారంభించారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం బిజెపి నుండి బయటకు వచ్చి, 'తల్లి తెలంగాణ పార్టీ'ని స్థాపించారు. అనంతరం తెలంగాణ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతి స్టార్‌ ఇమేజ్‌ కలిసొస్తుందని బిజెపి భావిస్తోంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకునేందుకు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కార్యాచరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.