ప్రజల ఆస్తిపన్నులో 50శాతం రాయితీ ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల కుటుంబాలకు లబ్ది
హైదరాబాద్,నవంబర్15(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్న అధికార టిఆర్‌ఎస్ అందుకు అనుగుణంగా నగరంలో అనేక కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ మేరకు మంత్రి కెటిఆర్ వివిధ కార్యక్రమాలతో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఆస్తిపన్నులో సగం తగ్గించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. 2020-2021లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 15 వేల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ.10 వేల పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆస్తిపన్ను చెలించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేయనున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాల వారికి భారీ ఊరట కల్పిస్తూ తీసుకున్న సీఎం నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ దాని చుట్టు ప్రక్కల ఉన్న 15 పట్టణాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయని కేటీఆర్ అన్నారు. వర్షాల వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. వారి పరిస్థితిని గమనించిన తర్వాత మనసున్న సీఎంగా స్పందిస్తూ సీఎం సహాయ నిధి నుండి రూ. 550 కోట్లు విడుదల చేశారన్నారు. తక్షణ వరద సాయంగా రూ. 10 వేలు అందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేటి వరకు 4 లక్షల 75 వేల 871 కుటుంబాలకు గాను ఇప్పటికే 470 కోట్ల పైచిలుకు రూపాయలను అందరికీ అందించడం జరిగిందన్నారు. దసరా ముందు రోజు 900 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కటే రోజు లక్ష కుటుంబాలకు సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల కుటుంబాలకు రూ.326.48 కోట్ల లబ్ది చేకూరనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుండగా ప్రభుత్వంపై రూ. 196.48 కోట్ల భారం పడుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో 17 లక్షల 68 వేల కుటుంబాలకు రూ.130 కోట్ల రిలీఫ్ లభించనున్నట్లు తెలిపారు.