హైదరాబాద్,నవంబరు 19(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లను దాఖలయ్యాయి. నామినేషన్లకు రేపటితో గడువు ముగుస్తుండటంతో దాదాపుగా ఇప్పటికే టికెట్ ఖరారైన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వీటిలో అత్యధికంగా తెరాస నుంచి 195 నామినేషన్లు దాఖలవగా.. భాజపా 140, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, తెదేపా 47, వైకాపా 1, సీపీఐ 1, సీపీఎం 4, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 15, స్వతంత్ర అభ్యర్థులు 110 మంది నుంచి నామినేషన్లు అందాయి. దీంతో ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. రేపే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.మరోవైపు ఇప్పటికే అధికార తెరాస రెండు జాబితాల్లో కలిపి 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. కాంగ్రెస్ 45, భాజపా 21 మంది అభ్యర్థులను మాత్రమే ఇప్పటివరకు ప్రకటించింది. మరోవైపు కలిసి పోటీ చేస్తున్న వామపక్షాలు.. రెండు జాబితాల్లో 26 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
నామినేషన్ల జోరు